పనబాక లక్ష్మి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆమె టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దాదాపుగా ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. తిరుపతిలో గెలిచిన వైసీపీ పార్లమెంటు సభ్యుడు దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. దీంతో పలు పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి.
పనబాక లక్ష్మి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా?
అవుననే అంటున్నాయి…రాజకీయవర్గాలు. గత ఎన్నికల్లో పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటుకు పోటీ చేసి ఓడినప్పటి నుంచీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆమె బీజేపీలో చేరాలనే ఉద్దేశంతోనే టీడీపీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అనుకోకుండా తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఆమె బీజేపీలో చేరి, తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతారని తెలుస్తోంది. అక్కడ బీజేపీకి కూడా సరైన అభ్యర్ధి లేరు. దీంతో పనబాక లక్ష్మి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తిరుపతిలో రసవత్తర పోరు తప్పదా?
తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం. అయితే ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో క్లారిటీ లేకపోయినా పార్టీలు మాత్రం అభ్యర్ధుల వేటలో పడ్డాయి. ఒకసారి గెలిచిన వ్యక్తి చనిపోతే అక్కడ పోటీ పెట్టకూడదు అనే నియమాన్ని టీడీపీ అనుసరిస్తూ వస్తోంది. ఈసారి కూడా అదే జరిగితే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని నిలిపే అవకాశం లేదు. ఇక పోరు వైసీపీ, బీజేపీ జనసేన కూటముల మధ్యే ఉంటుంది.
తిరుపతిలో వైసీపీ ఓటమి తప్పదా?
తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నికలు వస్తే అక్కడ వైసీపీ ఓటమి తప్పదని తెలుస్తోంది. హిందూ దేవాలయాలపై వరుసదాడుల నేపథ్యంలో హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను సీఎం జగన్మోహన్ రెడ్డి కాలరాశారు. ఇవన్నీ వైసీపీకి ఉప ఎన్నికల్లో ప్రతికూలంగా మారనున్నాయి.
ఇక బీజేపీ, జనసేన నేతలు కలసి పనిచేస్తున్నారు. టీడీపీ కూడా అక్కడ బలంగానే ఉంది. అయితే ఆపార్టీ అభ్యర్ధి బరిలో నిలిచే అవకాశం లేదు. ఇవన్నీ బీజేపీ కూటమికి కలసి వచ్చే అంశాలు. తిరుపతి ఉపఎన్నిక జరిగితే ఏపీలో బీజేపీ ఖాతా తెరవడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రాజకీయాలు ఎటు తిరుగుతాయో వేచిచూడాల్సిందే మరి.











