ఏపీలో గోదావరి వరద బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ తన స్పందనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. దాదాపు 200 గ్రామాలు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమ పదవి కాలంలో పోలవరం పూర్తి చేస్తానని పలుమార్లు ప్రకటించిన చంద్రబాబు ఆ పని చేయలేకపోయారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం కావచ్చు కేంద్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు లేకపోవడం కావచ్చు కారణాలైవనా గాని పోలవరం పూర్తి కాలేదు. పోలవరం సకాలంలో పూర్తి గాకపోవడంతో వరద నీరు గోదావరి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా పోలవరం పూర్తి చేయలేదని చెప్పాడని అర్ధమవుతోంది.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసినట్లయింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు కావడంతో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేయని పవన్ టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేశాడని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వరద ముంపు గ్రామాలలో ప్రభుత్వం సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన జనసేన బృందం చెప్పిన వాస్తవ పరిస్థితులను వింటే ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన వసతులు కల్పించడం లేదని అన్నారు. పునరావాస కేంద్రాలలో సరైన వసతులు లేవని అంటు వ్యాధులు ప్రబలకుండా సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడించారు.
పసిపిల్లలకు పాలు కూడా అందడం లేదని తెలిసిందని పాలను అత్యవసర జాబితాలో లేదని అధికారుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానం రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో పాలను అత్యవసర జాబితాలో చేర్చి పసిపిల్లల ఆకలి తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరద సమయంలో తాగు నీరు అందడం కూడా లేదని ఈ విషయంపై ప్రభుత్వం ద్రుష్టి సారించాలని కోరారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్నీ కోరుకుంటున్నానని అన్నారు. వరద బీభత్స కారణంగా 10 వేల ఎకరాల్లో వరి పంట, 14 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయని తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.