మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లూ అడ్డూ అదుపులేకుండా దౌర్జన్యాలకు పాల్పడింది పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఆయన అనుచరగణం. పుంగనూరు నియోజకవర్గంలో అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న టైంలోనే..చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ వ్యక్తికి చెందిన 100 కోట్ల ఆస్తిని ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ మహిళను అడ్డుపెట్టుకుని ఈ దందా నడిపినట్లు నిర్ధారించారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతోనూ కొంత రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలతో ఆ కోటీశ్వరుడు ఇప్పుడు పూట గడవని స్థితికి చేరుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..మదనపల్లెకు చెందిన మార్పూరు వెంకటేశులు..దాదాపు రూ.100 కోట్ల ఆస్తిపరుడు. వెంకటేశులు భార్య చనిపోయింది. ఒక్కాగానొక్క కొడుకు వికలాంగుడు. మదనపల్లె, చిత్తూరులో వెంకటేశులుకు దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. దీంతో వెంకటేశులు ఆస్తిపై పెద్దిరెడ్డి అనుచరుల కన్నుపడింది. గోవింద్ అనే వ్యక్తిని రంగంలోకి దించి వెంకటేశులుకు మదనపల్లెలో ఉన్న 160 గజాల స్థలాన్ని రూ.4.87 లక్షలకు కొనుగోలు చేయించారు. మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ఆఫీసులో వివిధ కారణాలు చూపించి రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని వెంకటేశులు చిత్తూరు జిల్లా పాకాల సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్లి 2023 జనవరి 27న రిజిస్ట్రేన్ చేయించుకున్నారు.
గోవిందును ముందుంచి 160 గజాల స్థలాన్ని కొనుగోలు చేయించిన పెద్దిరెడ్డి బృందం..కుట్రకు తెరలేపింది. పాకాల ఆఫీసులో వెంకటేశులు చేసిన సంతకాలను ఫోర్జరీ చేశారు. వెంకటేశులు పొలంలో చిన్న గుడిసె వేసుకుని నివసించే సులోచనను అడ్డుగా పెట్టుకుని ఈ దందా కొనసాగించారు. సులోచన ద్వారా వెంకటేశులు ఆస్తులు కాజేసే ప్రయత్నం చేశారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని పొన్నూటిపాలెంలోని 1.75 ఎకరాల భూమిని సులోచన పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు తయారు చేయించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద పాకాల సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో 629/2023 కింద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమని సులోచన తిరుపతికి చెందిన గాలి పూర్ణానంద చౌదరి, గుండ్లూరి నారాయణరెడ్డికి రూ.2.58 కోట్లకు విక్రయించారు. ఇక 160 గజాల భూమిని కొన్న రోజే రేణిగుంట తూకి వాకంలోని 4,498 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లను రూ.4.05 కోట్లకు తిరుపతికి చెందిన పూర్ణానంద చౌదరి, రాయపాటి ధరణ్‌కుమార్‌కు విక్రయించినట్లు వెంకటేశులు పేరుతో విక్రయ దస్తావేజులు కూడా తయారు చేయించారు. పాకాల సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించారు.
ఫోర్జరీ సంతకాలతో పవర్ ఆఫ్ అటార్నీ, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ వెంకటేశులు మదనపల్లె తాలూకా పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సులోచనతో పాటు పూర్ణానంద చౌదరి, నారాయణ రెడ్డి, నాసిర్, సాక్షి సంతకాలు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఐతే రిజిస్ట్రేషన్ నిలిపివేయడంపై పెద్దిరెడ్డి కుటుంబం 2024 జులై 16న హైకోర్టును ఆశ్రయించింది. ఐతే ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేశారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ లోపే మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాలిపోయాయి. దీని వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం హైకోర్టులో వేసిన పిటిషన్‌ను 2024 సెప్టెంబర్ 9న వెనక్కి తీసుకుంది.
ఇక మదనపల్లెలో సులోచన దందాలకు అడ్డూ అదుపులేదు. 14 క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు. ఇక సులోచన పేరుతో దాదాపు రూ.60 కోట్ల విలువైన ఆస్తులు స్వాహా చేశారు. ఫోర్జరీ సంతకాలతో వెంకటేశులు తమ్ముడికి చెందిన ఆస్తులను సైతం కాజేశారు.
పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతకు రూ.10 కోట్ల విలువైన భూమిని బహుమానంగా ఇచ్చారు. వెంకటేశులు పేరుతో తయారు చేసిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా సులోచనకు..అక్కడి నుంచి పూర్ణానంద చౌదరి, నారాయణరెడ్డికి వచ్చిన భూముల్లో పొన్నూటిపాళెంలోని 47 సెంట్లు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో 2023 జూన్ 19న మదనపల్లె రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించారు. దీని విలువ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్వర్ణలత ప్రతినిధిగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కుమారుడు మౌనీష్ కుమార్ రెడ్డి, సాక్షులుగా మాధవరెడ్డి సోదరులు రఘునాథ రెడ్డి, చంద్రారెడ్డి సంతకాలు చేశారు. ఇందులో 5 సెంట్ల భూమి మాధవరెడ్డికి బహుమానంగా ఇచ్చారు. ఐతే దీనిపై వెంకటేశులు సబ్‌రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టారు.
ఇది కేవలం ఒక్క వెంకటేశులు సంబంధించిన వ్యవహారం మాత్రమే. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల ఆగడాలతో నష్టపోయిన మరెందరో బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. పెద్దిరెడ్డి అక్రమాలను కూటమి ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంది.











