కామేపల్లి తులసిబాబు..ఇప్పుడు ఏపీలో ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. తులసిబాబు పెద్ద రాజకీయవేత్త కాదు..అలాగని బిజినెస్‌మెన్ కూడా కాదు. కానీ ఈ పేరు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలో కీలక వ్యక్తిగా ఉన్న తులసిబాబును సోమవారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు తులసిబాబును విచారించిన పోలీసులు ఆయనను తిరిగి జైలుకు తరలించారు.
ఈ నెల 8న ఒంగోలు ఎస్పీ ఆఫీసు దగ్గర కార్లు, అనుచరులతో హంగామా సృష్టించారు తులసిబాబు. వెంట వచ్చిన అనుచరుల అండ చూసుకుని ఊగిపోయారు. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు తులసిబాబు ఒంటరయ్యారు. మూడు రోజులుగా పోలీసులు తమదైన శైలిలో 100కుపైగా ప్రశ్నలు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. సాక్ష్యాలు ముందు పెడుతూ తను చేసిన అరాచకాలపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ హయాంలో గుంటూరు సీఐడీ ఆఫీసులో హత్యాయత్నం జరిగింది. ఈ కేసులోనే మూడు రోజులుగా తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించారు. ఈ విచారణ బుధవారంతో ముగియగా..ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. నాడు ఒంగోలు ఎస్పీ ఆఫీసు దగ్గర అనుచరగణంతో హంగామా సృష్టించిన తులసిబాబు..ఇప్పుడు అదే ఎస్పీ ఆఫీసు దగ్గర తన కోసం ఎవరూ కనిపించలేని స్థితిలో ఒంటరిగా మారాడు.
రఘురామ కేసులో ఈ నెల 8న ఒంగోలులో విచారణకు హాజరైన తులసిబాబు జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందానికి సహకరించలేదు. దీంతో అదే రోజు అర్ధరాత్రి అరెస్టు చేసి మరుసటి రోజు గుంటూరుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇన్నాళ్లూ రిమాండ్‌లో ఉన్న తులసిబాబును విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరగా..కోర్టు మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన పోలీసులు GGHలో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ పెరగడంతో చికిత్స అందించిన వైద్యులు..సాయంత్రం ఆరోగ్యం కుదురుకున్నాక పోలీసులకు అప్పగించారు. దీంతో మొదటి రోజు విచారణ గంటన్నర సేపు మాత్రమే సాగింది.
రెండో రోజు అంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు విచారించి కీలకమైన సమాచారం రాబట్టారు. బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి రిమ్స్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. 8 గంటలకు ఎస్పీ ఆఫీసుకు తీసుకొచ్చి గంట తర్వాత తిరిగి గుంటూరు తీసుకెళ్లారు.
తులసిబాబు మొదటిరోజు విచారణకు హాజరైనప్పుడు గొడవ చేసుకున్న నేపథ్యంలో అతన్ని విచారణ అధికారి, ఎస్పీ గట్టిగానే మందలించినట్లు సమాచారం. బిగ్‌బి టీంలో సభ్యులైన నలుగురు వ్యక్తులు ఎవరో తెలుసుకోవడంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దుబాయిలో స్నేహితులతో వ్యాపారం చేస్తున్నట్లు తులసిబాబు చెప్పడంతో వారి బ్యాగ్రౌండ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుచరుల్లో ఎవరైనా తులసిబాబు బినామీలు ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
తులసిబాబుతో కలిసి హంగామా చేసిన 20 మంది అనుచరులపై ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరందరికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టి..నేర చరిత్ర ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. మరోసారి ఇతరులు వారి తరహా ఆందోళనలకు దిగకుండా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు..కృష్ణా జిల్లా గుడివాడలో కీలక వ్యక్తిగా ఎదిగారు. గతంలో అక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొడాలి నానికి ముఖ్య అనుచరుడిగా మారారు. ఐతే ఇటీవలి ఎన్నికల్లో నాని ఓడిపోవడంతో ప్లేటు ఫిరాయించిన తులసిబాబు ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు.
వైసీపీ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై గుంటూరు సీఐడీ ఆఫీసులో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇదే సమయంలో భారీకాయుడైన తులసిబాబును రప్పించి..రఘురామ గుండెలపై కూర్చొబెట్టారని తెలుస్తోంది. ఈ ఘటనపై రఘురామ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. తులసిబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సాహసం చేయకపోవడంతో..స్వయంగా డీజీపీ కలగజేసుకుని కేసును ఒంగోలుకు బదిలీ చేయించారు. విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ను నియమించారు.











