ఈరోజు గూగుల్ విడుదల చేసిన డూడుల్ చూడగానే ఎవరబ్బా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆయన మరెవరో కాదు కెనడియన్ అమెరికన్ ఫ్రొఫెసర్, డాక్టర్, ఫిజికల్ ఎడ్యుకేటర్ జేమ్స్ నైస్మిత్. క్రాడాకారులు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన పేరిది. ఎందుకంటే బాస్కెట్ బాల్ అనే ఆటను కనుగొన్నది ఆయనే. అంటారియాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన జేమ్స్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. మామయ్య ఇంట్లో పెరిగాడు. ఆటలపై ఆయనకు ఓ ప్రత్యేకమైన విజన్ ఉండేది. మంచి కోచ్ గానూ వ్యవహరించారు. క్రీడా ప్రపంచానికి ఆయన చేసిన కృషికి గౌరవంగా గూగుల్ డూడుల్ ను విడుదల చేసింది. బాస్కెట్ బాల్ అంటే ఆయనకు ఎంతో మక్కువ ఎక్కువ. తన భార్యతో కలిసి కూడా ఆడేవాడు.

బాస్కెట్ బాల్ ఎలా పుట్టిందంటే..
క్రీడలంటే ఉన్న ఆసక్తికి అనుగుణంగానే ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచ్ లర్ డిగ్రీ పొందారు. 1890లో మాసాచుసెట్స్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ లోని వైఎంసీఏ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనర్ గా చేరారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఇండోర్ గేమ్ పై దృష్టి పెట్టారు. పిల్లల కోసం ఓ ఆటను అభివృద్ది చేయమని యాజమాన్యం కోరింది. దానికి 14 రోజుల గడువు ఇచ్చారు. అథ్లెటిక్ డిస్ట్రాక్షన్ ఇచ్చేలా ఈ క్రీడ ఉండాలి. ఒక బాస్కెట్, ఒక బాల్, పది సూత్రాలతో ఆయన మది నుంచి బాస్కెట్ బాల్ క్రీడ పుట్టింది. ఇవ్వాళ అది 200కు పైగా దేశాల్లో మంచి క్రేజ్ ఉన్న ఆట. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లోకి మొదటిసారిగా బాస్కెట్‌బాల్ ప్రవేశించింది. ఇలాంటి స్ఫూర్తిమంతమైన క్రీడను అందించిన జేమ్స్ నైస్మిత్ కు గౌరవ సూచికంగా గూగుల్ ఈ డూడుల్ విడుదల చేసింది.











