కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ గుడ్‌మార్నింగ్ ధర్మవరం ఈ ప్రొగ్రామ్ పేరు వింటే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు. ఆయనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ధర్మవరంలో ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోయిన కేతిరెడ్డి..6 నెలలుగా సైలెంట్‌గా ఉన్నారు. ఐతే తాజాగా ఆయన మౌనం వీడారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, గతంలో వైసీపీ ఎంపీగా పని చేసిన రఘురామకృష్ణంరాజులా సొంత పార్టీ వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఓటమికి అన్ని విధాలా పార్టీ హైకమాండ్ తీరే కారణమంటూ కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం, జగన్ తీరు, విజయసాయిరెడ్డి రాజీనామా,తాజా రాజకీయ పరిణామాలపై ఇటీవల కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
2019లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన RRR..అనతికాలంలోనే పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. జగన్ వెళ్తున్న దారి సరైంది కాదని చెప్పారు. కానీ జగన్ వినిపించుకోలేదు. గడిచిన ఐదేళ్లు RRRను సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా వేధించాడు.ఎవరు చెప్పినా వినకుండా మోనార్క్‌లా ముందుకు సాగాడు. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నాడు.
తాజాగా కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా*డి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై, టీడీపీ నేతల ఇళ్లపై దా*డులను కేతిరెడ్డి తాజాగా ఖండించారు. ఆ దాడులు ముమ్మాటికి తప్పేనన్నారు కేతిరెడ్డి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు తన చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లినప్పుడు కూడా తప్పని చెప్పానని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడం ద్వారా లేదా చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు కేతిరెడ్డి. అవతలి వ్యక్తి రెచ్చిగొట్టినప్పటికీ దాడులకు తెగబడడం సరికాదన్నారు కేతిరెడ్డి.
నారా భువనేశ్వరిపై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తనకు అవగాహన లేదన్న కేతిరెడ్డి..నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది తప్పేనన్నారు. పార్టీ అధిష్టానం అలాంటి నేతలను వారించి ఉంటే బాగుండేదన్నారు. కానీ అది జరగలేదన్నారు. చంద్రబాబును రాక్షసుల్లా వేధించారన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు కేతిరెడ్డి. అవతలి వాళ్లు ఎంత తిట్టినా, హేళన చేసిన చంద్రబాబు చాలా ఓపికగా వ్యవహరించారని ప్రశంసించారు. బాబును అరెస్టు చేయడం, పవన్‌ను అకారణంగా తిట్టడం టీడీపీ, జనసేనను ఏకం చేయడానికి ఉపయోగపడిందన్నారు. రాజకీయాల్లో పవన్‌కల్యాణ్‌ది ఓ సక్సెస్ స్టోరీ అన్నారు కేతిరెడ్డి.
ఇక ఇటీవల సోషల్‌మీడియాలో పెట్టిన ఓ వీడియోలోనూ వైసీపీ తీరుపై సున్నితంగా విమర్శలు చేశారు కేతిరెడ్డి. కేవలం పథకాల అమలు మీద దృష్టి పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టారని గుర్తు చేశారు కేతిరెడ్డి. చేసిన పనులు చెప్పుకోవడంలో వైసీపీ ఫేయిల్ అయిందన్నారు. ఇక విజయసాయి రెడ్డి రాజీనామా విషయంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాకినాడ సెజ్ విషయంలోనే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారన్న కేతిరెడ్డి..విజయసాయికి సీబీఐ,ఈడీల భయం పట్టుకుందన్నారు. ఆయన వాటికి అతీతుడేం కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం కూడా మైనస్ అన్నారు కేతిరెడ్డి.