అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ సీపీ తీసుకుంటున్న రిస్కుల్లో భాగంగా ఇప్పటికే పార్టీలో పగుళ్లు రావడం మొదలైన సంగతి తెలిసిందే. జగన్ కు అనునాయుడిగా భావించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే గాజువాక ఇన్ ఛార్జి కూడా రాం రాం చెప్పారు. అటు సిట్టింగ్ లకు టికెట్లు దక్కబోవని వార్తలు వస్తున్న వేళ ఇంకో 50 మంది దాకా ఎమ్మెల్యేలు వైసీపీ గడప దాటడానికి రెడీ అవుతున్నట్లుగా అంచనా. ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా టికెట్లు నిరాకరించబోతున్నారనే వార్తలు.. వైసీపీలో ముసలం మరింత ముదిరే సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ పరిస్థితిల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది అధికార వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడే అవకాశాలున్నాయని రఘురామకృష్ణ రాజు తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతోనే పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దంటే మాకొద్దని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారని అన్నారు. వైసీపీని రఘురామ మునిగిపోయే పడవతో పోల్చారు. ఆ మునిగిపోయే పడవ ఎక్కడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని రఘురామ చెప్పారు. ప్రజా తీర్పు అధికార వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకమని భారీ అంచనాలు ఉండడంతో రంద్రం పడిన పడవ ఎక్కేందుకు ప్రజా ప్రతినిధులు జంకుతున్నారని రఘురామ అన్నారు.
వైసీపీ అధిష్ఠానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి పరిణామాలు పార్టీ నేతల్ని తీవ్రంగా కలిచి వేశాయని అన్నారు. అందుకే వారు వైసీపీ అంటేనే వెనకడుగు వేస్తున్నారని అన్నారు. అయితే, తాజాగా రఘురామ చెప్పినట్లుగా క్రిష్ణా జిల్లా నుంచి పార్టీ మారబోయే మాజీ మంత్రిపై ఆసక్తి నెలకొంది. ఆయన చెప్పిన ప్రకారం.. పేర్ని నాని పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పేర్ని నాని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. తన బదులు తన కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తి (పేర్ని కిట్టూ) ని అక్కడ గెలిపించాలనే యోచనలో పేర్ని నాని ఉన్నారు. అయితే, ఇప్పటిదాకా తన కుమారుడు పేర్ని కిట్టూకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తాను ఇంత వరకు సీఎం జగన్ ను కోరలేదని కూడా పేర్ని నాని ఇటీవలే వ్యాఖ్యానించారు. 175 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. తన కుమారుడు ఆ 175లో పనికొస్తారని భావిస్తే ఆయనే టికెట్ ఇస్తారని అన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తన కుమారుడికి టికెట్ నిరాకరిస్తే.. పార్టీ వీడడానికి పేర్ని నాని రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.











