ఒంగోలులో బాలినేని బల ప్రదర్శన.. జగన్‌ని బెదిరిస్తున్నారా..??
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహార శైలి కొంత కాలంగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలినేని ఆ విధంగా వ్యవహరించారు. తన పుట్టిన రోజు వేడుకలను ఏనాడూ ఆయన చేయని రీతిలో నిర్వహించారు. తన పుట్టినరోజు వేడుకలను బలప్రదర్శన తరహాలో చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కువమంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు బాలినేని కూడా కొద్ది నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు మంత్రి పదవి తొలగినప్పుడే వైసీపీ నుంచి బయటికి వచ్చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, దాన్ని ఖండించిన బాలినేని పార్టీలోనే కొనసాగుతూ వైసీపీ అధిష్ఠానానికి ఇబ్బందికి గురిచేసేలా ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు.
అలా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా వైసీపీ అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం బాలినేని శ్రీనివాస్ ఒంగోలులో తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమం కూడా అంతే చర్చనీయాంశం అయింది. కొంతకాలంగా బాలినేని తన పుట్టినరోజు వేడుకలు ఇలా నిర్వహించలేదు. తన పుట్టిన రోజు నాడే ఆయన తల్లి చనిపోవడం వల్ల దాదాపు పదేళ్లుగా వేడుకలు నిర్వహించడం లేదు. కానీ, ఈసారి ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందలో ఆంతర్యంపై అనేక రకాల విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వేడుకలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కింది స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు.
మొత్తానికి ఈ వేడుకకు భారీగా వైసీపీ నేతల్ని సమీకరించడం బల ప్రదర్శన గానే చూస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ.. తాను తిరిగి ఒంగోలు నుంచే పోటీచేస్తానని.. ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డే ఒంగోలు నుంచి పోటీ చేస్తారని కూడా చెప్పేశారు. మళ్లీ వారి ఇద్దరి కాంబినేషన్ లోనే ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. మరోవైపు, బాలినేనితో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విభేదిస్తున్నారు. ఆయన ఒంగోలు లోక్‌సభ సీటు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బాలినేని తిరిగి ఎంపీగా మాగుంటే పోటీచేస్తారని ప్రకటించడం సంచలనంగా మారింది.
తాను అందరికోసం తపించి పని చేశానేగానీ తన కుటుంబం కోసం ఏనాడూ ఆలోచించలేదని ఈ వేడుకలో బాలినేని ప్రసంగించారు. తన ఫ్యామిలీ కూడా బయటివారి గురించి ఆలోచించడమేగానీ, తమ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ఎన్నో సార్లు తన ముందు అన్నారని అన్నారు. తన కుమారుడికి ఇప్పటిదాకా ఏమీ చేసుకోలేకపోయాననే బాధ ఉందని ఆవేదన చెందారు. దీంతో ఆయన మాటల్ని బట్టి.. తన కుమారుడికి కూడా ఆయన టికెట్ డిమాండ్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.











