తెలంగాణలో వైఎస్ షర్మిలకు రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు గేట్లు క్లోజ్ అవడంతో.. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలోకి ఎంట్రీ ఇస్తారని విశ్లేషణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా ఇస్తామనే బలమైన నినాదం ఇప్పటికే మొదలుపెట్టింది. ఇలాంటి సున్నితమైన అంశాల మీదుగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏపీలో పుంజుకోవాలని చూస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే.. సొంత సోదరుడైన జగన్ కు ఎదురు దెబ్బ కాబట్టి, జగన్ మేల్కొంటున్నట్లు తెలుస్తోంది. చెల్లెలితో విభేదాల నేపథ్యంలో రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్నా చెల్లెళ్లైన జగన్ – షర్మిల మధ్య కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాజీ కుదిర్చుతున్నారని ప్రచారం జరుగుతోంది. వారు ఇద్దరి మధ్య తగాదాలకు మూలమైన ఆస్తి విషయాల్లో జగన్ దిగి వస్తున్నట్లుగా సమాచారం. షర్మిలకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వడానికి జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఏపీలో రాజకీయాలు చేయడానికి సైతం షర్మిల సిద్ధం అవుతుండడంతో జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబానికి డీకే శివకుమార్ తో సాన్నిహిత్యం ఉండడం వల్లే అన్నా చెల్లెళ్లే పంచాయితీకి ఆయన్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం షర్మిల ఏపీ రాజకీయాల్లో రాకపోతే మేలు అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆమె ఈ వైపు చూడకుండా ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేసి తనకు తలనొప్పి లేకుండా చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పుచ్చుకుంటారని బాగా ప్రచారం జరుగుతుండగా.. ఆమె నుంచి ఎలాంటి స్పందనలు దీనిపై రాలేదు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ నుంచి కన్వర్ట్ అయిందే కాబట్టి.. షర్మిల ఏపీకి వస్తే వైఎస్ రాజశేఖర్ బిడ్డగా.. ఆమెకు ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.
ఇది వైఎస్ జగన్ కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. సొంత చెల్లెలిని మోసం చేశాడనే వాదన మరింత బలపడుతుంది. కళ్ల ముందే అన్నా చెల్లెళ్లు విమర్శలు చేసుకుంటుంటే.. ప్రజలకు అది బాగా అలుసుగా మారుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకు తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి, పరిస్థితి అక్కడిదాకా తెచ్చుకోకుండా.. ముందస్తుగానే జగన్మోహన్ రెడ్డి.. తన చెల్లెలిని ఏపీ వైపు రాకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నేతలతో జగన్ టచ్ లోకి వెళ్లాడని బీజేపీకి తెలియడంతో ఢిల్లీలో విజయసాయిరెడ్డి మరో గేమ్ స్టార్ట్ చేశారు. కశ్మీర్ పై పార్లమెంటులో జరిగిన చర్చలో బీజేపీని చల్లబర్చడానికి నెహ్రును తప్పుబట్టారు. తర్వాత ప్రధానిని కలిశారు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలను వైఎస్ఆర్ సీపీ సమానంగా వాడుకుంటుందన్నమాట. వారి ప్రయత్నాలు రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.