వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సతి వియోగం కలిగింది. ఆయన సతీమణి సత్యనారాయణమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాజకీయాలలో కూడా ఆమె చేదోడు వాదోడుగా ఉండేవారు. రాష్ట్ర రాజకీయాలలో బోస్ బిజీగా ఉన్న సమయంలో సత్యనారాయణమ్మ నియోజకవర్గ సమస్యలు చూసేవారని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. సతీమణి మరణంతో షాక్ లో ఉన్న బోస్ ను ఓదార్చడం ఎవరికి సాధ్యపడలేదు.
హైదరాబాద్ లో మరణించిన ఆమె మృతదేహాన్ని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి తరలించనున్నారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణమ్మ మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ శ్రేణులు హుటాహుటిన బోస్ ఇంటికి చేరుకున్నారు. బోస్ కు వైసీపీ అగ్రనేతలు ఫోన్లు చేసి తమ సంతాపాన్ని తెలియచేశారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికైన
విషయం విదితమే.