లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆడపిల్ల పుట్టిందని ఆ ఇంట పండగ చేసుకున్నారు. అయితే అంతలోనే అనుకోని ఘటనతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అభంశుభం ఎరుగని ఆ చిన్నారిని చిప్స్ రూపంలోని ఓ ప్లాస్టిక్ బొమ్మ ప్రాణాలను తీసేసింది. ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతున్న ఆ చిన్నారికి తల్లిదండ్రులు సరదాగా చిప్స్ పేకెట్ తినడానికి ఇచ్చారు. అదే ప్యాకెట్ లో పిల్లలు అడుకోవడానికి అదనంగా పెట్టిన ప్లాస్టిక్ బొమ్మను కూడా ఆ చిన్నారి మింగేసింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
గొంతుకు అడ్డం పడి…ఉక్కిరిబిక్కిరరై…
విజయనగరం జిల్లా గరుగబిల్లి మండలం చినగుడబకు చెందిన ఏడాది వయస్సు గల బలగ మౌనిక చిప్స్ తింటూ, అందులో ఉన్న ప్లాస్టిక్ బొమ్మను చిప్ అనుకుని తినేసింది. అది గొంతులో అడ్డం పడటంతో ఊపిరాడక బిగ్గరగా ఏడ్చింది. చిన్నారి తల్లి గుర్తించి తండ్రి సహకారంతో హుటాహుటిన పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే ప్రాణాలు పోయినట్లు వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబీకులు బోరున రోధించారు. ఒక్కాగానొక్క కుమార్తె ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
ఎవరిదీ నిర్లక్ష్యం…?
చిన్నారి మృతికి కారణం చిప్స్ ప్యాకెట్ లో ప్లాస్టిక్ బొమ్మ పెట్టి వ్యాపారం చేసుకుంటున్న కంపెనీయా, నిర్లక్ష్యంగా ఆ ప్యాకెట్ తినడానికి ఆ చిన్నారికి ఇచ్చిన తల్లిదండ్రులా అనేది చర్చనీయాంశంగా మారింది.











