అన్యాయం ఎక్కడ జరిగినా బాధితుడు ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. ఆ నేరం వారి పరిధిలోది అయినా కాకపోయినా.. ముందు జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. ఆ తరువాత.. నిదానంగా.. కేసు ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుసుకుని ఆ స్టేషనుకు కేసు బదిలీ చేయాలి. ఇది సామాన్య ప్రజలకు చట్టం ఇస్తున్న అధికారం. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు ఏం జరిగింది?
పోలీసుల అడ్డగింపు ఘటనపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడానికి వెళ్లిన, సస్పెండైన జడ్జి రామకృష్ణకు చుక్కెదురైంది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ వీరేష్ కేసు నమోదు చేయలేదు. ఏఎస్ఐ జ్యోతిరామ్ కు జడ్జి రామకృష్ణ పిర్యాదు కాపీ అందించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి రశీదు ఇవ్వాలని జడ్జి రామకృష్ణ కోరగా పోలీసులు నిరాకరించారు. చేసేది లేక జడ్జి రామకృష్ణ వెనుదిరిగారు.
ఫిర్యాదు పోలీసులపైనే..
నా కుమారుడిని అపహరించి, సెల్ ఫోన్, పర్సు గుంజుకుని తిరుపతిలో గంటపాటు తిప్పారని, నన్ను లోబరుచుకునే కుట్ర ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదులో పోలీసులను కోరినట్టు జడ్జి రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఏమిటీ ఈ జీరో ఎఫ్.ఐ.ఆర్
నిర్భయ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరవాత 2013 క్రిమినల్ లాకు చట్ట సవరణ చేసి జీరో ఎఫ్.ఐ.ఆర్ కాన్సెప్టును తీసుకువచ్చారు. అన్యాయం ఎక్కడ జరిగినా బాధితులు తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయవచ్చు. సహజంగా కేసు నమోదు చేసి ఎఫ్.ఐ.ఆర్ లో నెంబరు కేటాయిస్తారు. కేసు తమ పరిధిలోకి రానప్పుడు మాత్రం ఎప్.ఐ.ఆర్ పై జీరో నెంబరు వేసి కేసు నమోదు చేస్తారు. అందుకే దీన్ని జీరో ఎఫ్.ఐ.ఆర్ అంటారు.
ఎఫ్.ఐ.ఆర్ పై జీరో వేసినా కేసును సంబంధిన స్టేషన్ కు పంపించిన తరవాత నెంబరు కేటాయిస్తారు. అంటే జడ్జి రామకృష్ణను పోలీసులు అడ్డుకున్న కేసు తిరుపతి తూర్పు స్టేషన్ పరిధిలోకి రాకపోయినా, ముందుగా వారు జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. కానీ అలా చేయలేదు. అంటే ఏపీలో జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు జరగుతుందా? అనే అనుమానం రాక మానదు.
ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఏడాది శిక్ష
పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ 166 ఏ కింద ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఫిర్యాదు చేసే వాళ్లు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసులు రాసుకుని, సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి. రిజిస్టర్లో సంతకం పెట్టాలి.
గతంలో కర్ణాటక హైకోర్టు 2019 సెప్టెంబరు 19న ఒక రిట్ పిటిషన్ విషయంలో జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. తన ఉత్తర్వుల్లో భాగంగా, జీరో ఎఫ్ఐఆర్ గురించి 2014 ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీసుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నేరం గురించి తెలిసిన వెంటనే కేసు ఖచ్చితంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఇక్కడ ‘జీరో ఎఫ్ఐఆర్’కు దిక్కేదీ?
తిరుపతిలో తాజాగా జరిగిన ఎపిసోడ్ విషయంలో పోలీసులు ఎందుకు నమోదు చేసుకోలేదు. జడ్జి రామకృష్ణ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది గనుక.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోలీసులు జంకుతున్నారా? భయపడుతున్నారా? అనే అనుమానాలు మనకు కలుగుతాయి. పైగా కంప్లయింటు ఇవ్వడానికి వెళ్లింది సామాన్యుడు కాదు.. సస్పెండయిన జడ్జి. న్యాయ పరమైన విషయాలు తెలిసిన వ్యక్తి. అలాంటివాళ్ల ఫిర్యాదుకే దిక్కులేకపోతే.. ఇక సామాన్యుడి గోడును పోలీసులు పట్టించుకుంటారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.











