పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం, నిధుల విడుదల విషయంలో పీటముడి పడింది. టీడీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2014 ధరల ప్రకారం అంచనా వేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు వ్యయం 55 వేల కోట్లకు సాంకేతిక అంచనా కమిటీ ఆమోదం కూడా టీడీపీ ప్రభుత్వం ఆనాడే సాధించిందని మాజీ జలవనరుల మంత్రి దేవినేని స్పష్టం చేశారు. పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదింపజేసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు తప్పుమీదంటే మీదని నిందలు వేసుకుంటున్నారు. పోలవరం విషయంలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది?
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారుగా మరి గొడవేంటి?
రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2014లో పోలవరం అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అప్పటి ధరల ప్రకారం పోలవరం అంచనాను 20398 కోట్లకు కుదిస్తూ డీపీఆర్ 2ను కేంద్ర జలసంఘం ప్రతిపాదించింది. అదేంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కదా? ఎంత ఖర్చయినా కేంద్రమే భరించాలి కదా? అనే అనుమానం సామాన్యులకు సైతం వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మేం 2014 ధరల ప్రకారమే ఖర్చు భరిస్తామని చెబుతోంది. ఇది ఖచ్చితంగా దుర్మార్గమే. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ ఎంత ఖర్చయినా కేంద్రం భరించాలి. కానీ కొర్రీలు పెడుతూ ఖర్చును తప్పించుకునే ప్రయత్నం చేస్తోందనే అనుమానాలు వస్తున్నాయి.
2014 ధరలు ఇప్పుడెలా అమలు చేస్తారు
నిర్మాణ వ్యయం, పరిహారం చెల్లింపులు పెరుగుతూ ఉంటాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు మన దేశంలో దశాబ్దాలపాటు కొనసాగుతూ ఉంటాయి. 2004లో వైఎస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. 2009 వరకూ రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరవాత వైఎస్ మరణంతో పోలవరం ప్రాజెక్టు పనులు పడకేశాయి. రాష్ట్ర విభజన జరగడం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగిపోయింది. 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులు చురుగ్గా చేయించింది.
విభజనకు ముందు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు కూడా కేంద్రం భరించాలని కోరింది. కొంత వరకు సాధించగలిగింది. ఇలా పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులను 2019 నాటికే 73 శాతం పూర్తి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రివర్స్ టెండరింగ్ అంటూ సంవత్సర కాలం పోలవరం పనులు నిలిపివేశారు. చివరకు మెఘా కంపెనీకి పనులు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.
పనుల విషయంలో అభ్యంతరాలు పక్కనపెడితే కేంద్ర నిధుల విడుదల విషయంలో కొర్రీలు పెడుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 20398 కోట్లకు కుదిస్తూ కేంద్ర జలసంఘం డీపీఆర్ 2 ను తయారు చేసి పోలవరం అథారిటీకి పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. పెరిగిన నిర్మాణ ఖర్చులు, పరిహారం అంతా కలుపుకుంటే తాజాగా పోలవరం వ్యయం 55 వేల కోట్లవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఇందుకు అంగీకారం తెలపడం లేదు.
తప్పెవరిది ?
ఏపీలో టీడీపీ, వైసీపీలు తప్పును ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2014 ధరల ప్రకారం అంగీకరించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పోలవరం అంచనా వ్యయాన్ని 55 వేల కోట్లకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని మాజీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు తప్పును నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల రాజకీయ ప్రయోజనమే కానీ ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు.
రాష్ట్రం ఏ కోరుతోంది? కేంద్రం ఏం చెబుతోంది?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, పరిహారం తాజా గణాంకాల ప్రకారం 55 వేల కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీన్ని ఆమోదించాలని పోలవరం అథారిటీని కోరింది. కానీ కేంద్ర జలసంఘం డీపీఆర్ 2ను 20398 కోట్లకు తయారు చేసి పోలవరం అథారిటీకి పంపించింది. దీంతో పోలవరం నిర్మాణ వ్యయం విషయంలో భారీగా తేడా వచ్చింది. డీపీఆర్ 2ను పోలవరం అథారిటీ ఆమోదిస్తేనే ఇప్పటి వరకూ ఏపీ చేసిన ఖర్చుల నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టారు.
అయితే పెరిగిన పోలవరం వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇది సమంజసం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఎంత ఖర్చయినా భరించాలి కానీ 2014 ధరల ప్రకారం ఖర్చు భరిస్తాం. 2009 సంవత్సరానికి ముందు చేసిన వ్యయం మాకు సంబంధం లేదని చెప్పడం అంటే పోలవరం విషయంలో కేంద్రం తప్పించుకోవాలని చూస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఫెయిల్యూర్ చంద్రబాబుదా? జగన్‌దా?
పోలవరం విషయంలో ఎవరిదీ ఫెయిల్యూర్ కాదు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడే పోలవరం అథారిటీ ఏర్పడింది. అప్పటి అంచనాల ప్రకారం పోలవరం వ్యయం 20398కోట్లే. కానీ పరిహారం విషయంలో 2013 భూ సేకరణ చట్టం అమల్లోకి రావడంతో పోలవరం వ్యయం 55 వేల కోట్లను దాటిపోయింది. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం 15 వేల కోట్లయితే పరిహారం మాత్రం 35 వేల కోట్లపైగానే చెల్లించాల్సి వస్తోంది. పోలవరంలో ప్రధాన ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నా, పరిహారం విషయంలో ఇప్పటికీ 2 శాతం కూడా చెల్లించలేదు.
ఇక పోలవరం పనులు పరుగులు పెట్టించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ పరిహారం చెల్లింపుల విషయంలో విఫలమయ్యారు. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక పునరావాసం, పరిహారం మొదలు పెడితే ప్రాజెక్టు ఫలాలు అందడానికి మరో 15 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, పునరావాసం, పరిహారం కూడా ఏక కాలంలో పూర్తి చేయాలి. ఆ పని చంద్రబాబూ చేయలేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చేయడం లేదు. చివరకు పోలవరం ప్రాజెక్టు పనులు నూరు శాతం పూర్తయినా పరిహారం, పునరావాసం మాత్రం మరో మూడు దశాబ్ధాలు పట్టేలా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్టు మరో నర్మదా ప్రాజెక్టులా తయారవుతుందనే అనుమానాలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5 మండలాల్లో 273 గ్రామాలను తరలించాల్సి ఉంది. గడచిన మూడు దశాబ్ధాల్లో దేశంలో ఇదే అతి పెద్ద పునరావాస, పరిహారం చెల్లించాల్సి వచ్చిన ప్రాజెక్టుగా పోలవరాన్ని చెప్పుకోవచ్చు. పోలవరం విషయంలో ఫెయిల్యూర్ చంద్రబాబుదా, జగన్ దా అని తేల్చడం కూడా కష్టం. ఎందుకంటే చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో చేయలేనిది, జగన్మోహన్ రెడ్డి ఒకటిన్నర సంవత్సరంలో చేస్తాడని ఆశించలేం. అయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక ఎంత ఖర్చయినా కేంద్రం భరించాలి. ఆ దిశగా ఏపీలో అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలో పారాడాలి. అంతేకాని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని చెప్పాల్సి ఉంటుంది.