మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయనున్నారని మనం ఎప్పుడో వార్త ఇచ్చాం. ఈ సినిమా హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సాగర చంద్ర ఇంతకుముందు అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలు రూపొందించారు. ఈ సినిమా ప్రధానంగా ఓ యాటిట్యూడ్ పోలీస్ ఆఫీసర్, మాజీ మిలిటరీ అధికారి మధ్య జరిగే కథ. మలయాళంలో పృధ్వీరాజ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తారా, బిజూ మీనన్ పాత్రను పోషిస్తారా? అన్న సస్పెన్స్ నెలకొంది. ఇందులో రెండూ పవర్ ఫుల్ పాత్రలే. అయితే నటనకు ఎక్కువ అవకాశం బిజూ మీనన్ పాత్రకు ఉంది. అలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పాత్రనే పోషించే అవకాశం ఉంది. అదే నిజమైతే మరి పృధ్వీరాజ్ పాత్రను ఎవరు పోషించవచ్చు. ఫిలింనగర్ సమాచారం మేరకు ఈ పాత్రను రానా పోషించవచ్చని తెలుస్తోంది.
అయితే రానా ఇందులో నటిస్తున్నాడా లేదా అన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. దీనికి ఒకప్పటి ‘బిల్లా రంగా’ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఇంకో సమాచారం. కాకపోతే పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో పవన్ పాత్ర నిడివిని ఇంకా పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.











