బాలు స్వరం ఇక్కడ మూగవోయింది.. గాన గంధర్వం స్వర్గానికి చేరిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు కన్నుమూశారు. నిన్న ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. సాయంత్రానికి అత్యంత విషమంగా మారింది. ఎక్మో, వెంటిలేటర్ లపైనే బాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు నిన్నసాయంత్రం 6.30 గంటలకు అధికారికంగా వెల్లడించాయి. ఇతర ప్రాణాధార చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న బాలును ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్సపొందుతున్నారు. ఈరోజు భారతీరాజా ఆస్పత్రిని సందర్భించి బాలు ఇక మనకు లేరని కూడా ప్రకటించారు. భారతీరాజా, ఇళయరాజా ఆయన సన్నిహిత మిత్రులు.
ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని జనావళికి అందిస్తూనే ఉన్నారు. ఆయన త్వరగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా చరణ్ ఇటీవల వెల్లడించారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు మరణ వార్తను అధికారికంగా ధ్రువీకరించారు. బాలు త్వరగా కోలుకోవాలని ప్రపంచవాప్తంగా అందరూ కోరుకుంటున్నారు. గత 40 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్నారు.

మొదట్లో కరోనా పాజిటివ్ వచ్చినా కోలుకున్నాక పరీక్షలు చేసి నెగిటివ్ గా నిర్ధారించారు. కాకపోతే ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జి చేయలేదు. ఈ గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యంపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. వైద్యులు విషయాన్ని దాచి ఉంచుతున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కూడా వైద్యులకు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఆయన ఆరోగ్యంషి విషమంగానే ఉందని, సాధారణ స్థితికి తీసుకురావడానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞ.. బాలుకే సొంతం
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు.. ఈ మాట బాలుకు అక్షరాలా వర్తిస్తుంది. పాటల్లో ఇంతటి ఘనాపాటి అయిన బాలు ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు. పూర్వజన్మ సుకృతమే ఆయనను పాటల వైపు నడిపించిందేమో. నేపథ్య గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ రాణించారు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా.. ఇలా అనేక రకాలుగా రాణించారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనేది బాలు అసలు పేరు. పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో 1946 జూన్ 4న. తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా పండితుడు.

తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్న ఆ కుటుంబములో బాలు రెండో వాడు. చిన్నప్పటి నుంచే పాటలు పాడటం బాలుకు హాబీ. ఇంజినీరింగ్ చదవాలనుకుని మద్రాసు వెళ్లి ఏఎంఐఈ కోర్సులో చేరారు. ఇంజినీరుగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న బాలు చివరికి గాన గంధర్వుడయ్యారు. 1966 లో హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమా ద్వారా గాయకుడిగా బాలు సినీయానం ప్రారంభమైంది. ఇప్పటిదాకా 17 భాషల్లో 41 వేల పైచిలుకు పాటల్ని బాలు పాడారు. ఓ గాయకుడు ఇన్ని భాషల్లో ఇన్ని పాటలు పాడటం అరుదైన రికార్డు. ఒక్క తెలుగువారికే కాదు అనేక భాషల వారికి కూడా బాలు ఆరాధ్యుడు. అర్ధ శతాబ్దానికి పైగా ఆయన పయనం కళారంగంలో కొనసాగింది.
టీవీలు రంగ ప్రవేశం చేశాక అనేక కార్యక్రమాలకు హోస్టు గానూ ఆయన వ్యవహరించారు. ఈటీవీ పాడుతూ తీయగా ద్వారా ఎంతో మంది కొత్త గాయనీగాయకులను పరిచయం చేశారు.. వారిలోని ప్రతిభను వెలికితీశారు. బాలు సతీమణి సావిత్రి. సంగతీం మీదున్న మక్కువతో తన పిల్లలిద్దరికీ పల్లవి, చరణ్ అని పేర్లు పెట్టారు. పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. ఆరు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు.. ఇలా ఒకటారెండా.. ఎన్నో అవార్డులు బాలు సొంతమయ్యాయి. చరిత్రలో బాలు శకం అలా మిగిలిపోతుంది. దీన్ని మరెవరూ భర్తీ చేయలేరు.
ప్రముఖ దర్శకుడు, బాలు మిత్రుడు గంగై అమరన్ కుమారుడు వెంకట్ ప్రభు బాలు మరణాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. గంగై అమరన్, ఇళయరాజా, బాలు ఒక ట్రూప్ ను ఏర్పాటు చేసి అనేక షోలు చేసిన సంగతి తెలిసిందే.
#RIPSPB 1:04pm
— venkat prabhu (@vp_offl) September 25, 2020
Sad and a heartbreaking day #SPBalasubrahmanyam . Lived his life beautifully, contributing to society his passion and music. His voice will live on forever. May he rest in peace 🙏🙏🙏🙏🙏
— Radikaa Sarathkumar (@realradikaa) September 25, 2020











