అమరావతి రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్రాసిటీ చట్టం కింద ఎస్సీ రైతులను అరెస్టు చేయడమే కాకుండా 18 రోజులు బెయిల్ లేకుండా జైల్లో పెట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. పోలీసులు ఇలా ప్రవర్తించడం రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతులను అరెస్టు చేయడానికి సరైన కారణాలు చూపించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం తమకు ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. పోలీసులే ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికెళ్లాలని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ పై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా అయితే రూల్ ఆఫ్ లా ఎలా అమలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
రూల్ ఆఫ్ లా ఉందా?
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేస్తే అది అక్రమనిర్భంధం కిందకే వస్తుంది. ఇది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడంతోపాటు, కోర్టు ధిక్కరణ కిందకు కూడా వస్తుందని రాజధాని రైతులపై అట్రాసిటీ కేసు విచారణలో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరు చేసినా అక్రమనిర్భంధంపై విచారణ కొనసాగింవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు న్యాయమూర్తి గుర్తుచేశారు. అమరావతి రాజధానికి చెందిన ఏడుగురు రైతులు తమను అక్రమంగా నిర్భంధించడమే కాకుండా ఐదుగురు ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయసూత్రాలను అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు కేసును వాయిదా వేసింది.
Must Read ;- జస్టిస్ రమణపై విషం: మోసగాడు, జైలుపక్షే దొరికాడా?