అమరావతి రాజధాని రైతులకు అక్రమంగా అరెస్టు చేసి బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష టీడీపీ ఇవాళ గుంటూరు జైల్ భరోకు పిలుపునిచ్చింది. పలు జిల్లాల్లో టీడీపీ నేతలు చేపట్టిన గుంటూరు జైల్ భరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ముందుగానే పోలీసులు టీడీపీ కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు ఘర్షణ చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాజీ మంత్రి ఆలపాటి రాజేంధ్రప్రసాద్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేత కోవెలమూడి రవీంద్రలను హౌస్ అరెస్టు చేశారు. దీంతో వారి ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో అమరావతి జేఏసీ మహిళా నేతలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని మహిళా రైతులు పోలీసులను నిలదీశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ఎస్సీ రైతులను అక్రమంగా అరెస్టు చేయడమే కాక వారికి బేడీలు వేసి ఈ ప్రభుత్వం పెద్ద తప్పే చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు. నెల్లూరు టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అజీజ్ గుంటూరు జైల్ భరోకు సిద్దమవ్వగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అజీజ్ అనుచరులు అక్కడికి భారీగా చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
వర్ల రామయ్య, బుద్దా వెంకన్న హౌస్ అరెస్ట్
విజయవాడలోనూ టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరోకు మద్ధతు పలుకుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ముందే పోలీసులు వారి ఇళ్లకు చేరుకుని హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ పోలీసులను ప్రశ్నించారు. అటు బుద్దా వెంకన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలో టీడీపీ కీలక నేతలందరినీ హౌస్ అరెస్టు చేశారు. ఏలూరులోనూ టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి గ్రామాల్లో భారీ స్పందన
రాజధానిలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ రైతులను అక్రమంగా అరెస్టు చేసి బేడీలు వేయడంపై అమరావతి రైతులు ఉద్యమించారు. రాజధాని ఉద్యమం 319 రోజులకు చేరినా శాంతియుతంగానే ఉద్యమాన్ని సాగిస్తున్నామని, అయినా పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉందని వారు ధ్వజమెత్తారు. రాజధాని ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న రైతులను గృహ నిర్బంధం చేయడాన్ని స్థానిక రైతులు తప్పుపట్టారు. రాజధాని గ్రామాల్లో ఉద్యమానికి భారీ స్పందన వస్తోందనే సమాచారంతో అమరావతి 29 గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.