తమిళనాడులో స్టార్ హీరో విజయ్, ఆయన తండ్రి వెటరన్ డైరెక్టర్ యస్.ఏ చంద్రశేఖర్ మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. తాజాగా విజయ్ అభిమానులు చేసిన తీర్మానంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. అసలు ఈ వివాదానికి కారణం ఏమిటంటే హీరో విజయ్ అనుమతి లేకుండా ఆయన తండ్రి.. విజయ్ పేరు మీద ఒక రాజకీయ పార్టీ పేరును నమోదు చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతుంది అని కూడా ఒక స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
ఈ విషయం హీరో విజయ్ కు తెలియదు. ఈ విషయంతో ఆగ్రహించిన విజయ్ తన తండ్రి చేసిన చర్యను పూర్తిగా తప్పుబట్టాడు. తనకు, తన తండ్రి పెట్టనున్న రాజకీయ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అక్కడితో ఆగకుండా విజయ్ 30 జిల్లాలకు సంబంధిన తన ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షులతో ఒక అత్యవసర సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో తనకు, తన తండ్రి పెట్టనున్న రాజకీయ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్. తన తండ్రి పెట్టబోయే రాజకీయ పార్టీకి అభిమానులందురూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. మనం ప్రజలకు మంచి పనులు చేయడానికి రాజకీయ పార్టీ పెట్టనవసరం లేదని అనేక మార్గాల్లో ప్రజలకు సేవ చేయచ్చని హీరో విజయ్ తెలిపాడు.
ఇదిలావుండగా మదురై జిల్లాలో జరిగిన విజయ్ ఫాన్స్ అస్సోసియేషన్ సమావేశంలో విజయ్ తండ్రి పెట్టనున్న రాజకీయ పార్టీలో ఎవరూ జాయిన్ అవ్వకూడదని అభిమానులు నిర్ణయించుకున్నారు. తమ అభిమాన నటుడు ఏ విషయం చెప్పినా తాము పాటిస్తామని వారు తెలిపారు. హీరో విజయ్ అనుమతి లేకుండా తము ఎటువంటి రాజకీయ సమావేశాలకు వెళ్ళమని వారు తీర్మానించుకున్నారు. ఈ సమావేశమే తాజాగా మరోసారి హీరో విజయ్, ఆయన తండ్రి మధ్య గొడవలకు కారణం అయ్యింది. విజయ్ తన అభిమానులకు పార్టీలో జాయిన్ అవ్వొద్దని చెప్పడంపై విజయ్ తండ్రి సీరియస్ గా ఉన్నారని తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి మరి.










