వకీల్ సాబ్.. వకీల్ సాబ్.. వకీల్ సాబ్ ఏ ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి మాట్లాడుకున్నా వచ్చే మొదటి మాట ఇదే. పవన్ కాస్త విరామం తరువాత నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2020 మే నెలలోనే రిలీజ్ అవ్వాలి. కాని కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో నిలిచిపోయింది. సుమారు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.
చివరి షెడ్యూల్ ని చిత్ర బృందం ప్రారంభించింది కూడా. అయితే పవన్ మాత్రం ఇంకా సెట్ లో అడుగుపెట్టలేదు. వచ్చే నెల రెండొవ వారంలో పవన్ షూటింగ్ లో పాల్గొంటాడని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ కు, ‘మగువ మగువ’ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. టీజర్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఫాన్స్ కూడా ఎప్పటి నుండో `వకీల్ సాబ్` టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం వచ్చేసింది.
త్వరలోనే ఈ సినిమాకు సంభందించి ఒక అద్భుతమైన టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్రం బృందం ప్లాన్ చేస్తుందని సమాచారం. కీలక సన్నివేశాలతో కూడిన టీజర్ ని అదిరిపోయే రేంజ్ లో సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ 80శాతం షూటింగ్ పూర్తి చేసాడు. అందులో ఉన్న మంచి సన్నివేశాలతో కూడిన టీజర్ ను రిలీజ్ చేస్తారని టాక్. పవన్ అభిమానులకు ఈ దసరా పండుగను మరిచిపోలేని రేంజ్ లో సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈవార్త నిజమైతే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి.