ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఇది దశాబ్దాల ఆంధ్రుల కలని చెప్పుకుంటుంటారు. పేరుకు పెద్ద ఫ్రాజెక్టు అని చెప్పుకున్నా ప్రస్తుతం దాని నిర్మాణం రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్టు సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఈ ప్రాజెక్లు పనులు కొంత వరకు వేగవంతంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కాలంలో నిధులను వేగవంతంగా రాబట్ట గలిగారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడంతో కేంద్రమే పూర్తి స్థాయి నిధులిస్తామని చెప్పుకొచ్చింది. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యాయం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు విలువ రూ.47వేల కోట్లుగా ప్రభుత్వం ఎస్టిమేషన్ సిద్దం చేసి కేంద్రానికి లేఖ రాసింది. నిధుల విడుదలకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్రం ఎప్పటికీ స్పందించక పోవడంతో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పోలవరంకు రూ.20వేల కోట్ల కంటే ఎక్కవ ఇచ్చేది లేదని చెప్పారు. దీంతో ఆంధ్రా ప్రాంత ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్క సారిగా ఆందోళన నెలకొంది. కేంద్రం పూర్తి స్థాయి నిధులు కేటాయించాల్సిందేనని … విభజన హామీ నేరవేర్చేందుకు పూర్తిస్థాయి ఖర్చు కేంద్రమే భరించాలని సూచిస్తున్నారు రైతులు, నేతలు, మేధావులు.
క్లారిటీ తీసుకునేందుకు అధికారులతో పీపీఏ సమావేశం..
పోలవరంపై వివాదాలను నివారించేందుకు కేంద్రం దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్లుసీ ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నుంచి జగదీష్ గుప్త, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు ఏపీ ప్రభుత్వ ఈఎన్సీ హాజరయ్యారు. తెలంగాణ సైతం పోలవరం ముంపు ప్రాంతాల పరిహారంపై కేంద్రానికి లేఖ రాయడంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు కూడ సమావేశానికి హజరయ్యారు. పోలవరం నిర్మాణ వ్యాయం పెరిగినందున ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సమావేశంలో సూచించారు. కేద్రం ఇస్తామంటున్న నిధులు నిర్వాసితులకు ఇచ్చేందుకు కూడా సరిపోవంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందు ఏపీ మరోసారి వాధనలు వినిపించింది. నిధులు విడుదల చేయకపోతే ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అథారిటీ దృష్టికి తీసుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకు వచ్చిన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపినట్టు ఏపీ అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ కేంద్రం దృష్టికి తీసుకువచ్చిన ముంపు ప్రాంతాలపై అధ్యయనం ఒక ముగిసిన అధ్యాయమని చెప్పుకొచ్చారు ఏపీ ఈఎన్సీ. ప్రాజెక్టు నింపినప్పుడు ఇబ్బందులు తలెత్తితే అప్పుడు ఆలోచన చేద్దామనన్నారు.
రైతులు, విపక్ష పార్టీల ఆందోళన
పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్ర నిర్ణయంపై రైతులు, విపక్ష పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశానికి హాజరైన జలశక్తి మంత్రాలయం అధికారులను కలిసేందుకు వచ్చిన రైతులు వారు అక్కడ లేక పోవడంతో పీపీఏ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం పోలవరానికి అవసరమైన అన్ని నిధులు మంజూరు చేయాలంటూ విజ్ఙప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఇక పోలవరం నిధులపై అన్ని పక్షాలు రైతులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని గుర్తు చేస్తున్నారు మేధావుల సంఘం ప్రతినిధులు.