ఆయన అధికార పార్టీ ఎమ్మెల్సీ. రాజకీయ కురువృద్ధుని కుమారుడు. కొన్ని దశాబ్ధాలుగా తన సొంత నియోజకవర్గంలో చక్రం తిప్పిన కుటుంబం వారిది. అయితే ప్రస్తుతం సొంత పార్టీ నాయకులే పక్కన పెడుతుండటం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? ఎంటా కథ?దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా తయారైంది ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్ బాబు) పరిస్థితి. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ పదవిని కట్టబెట్టినప్పటికీ ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలే ఆయన్ను దూరం పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ప్రాంత నాయకులు కూడా ఆయనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేశారు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన రాజకీయ కురువృద్ధుడు స్వర్గీయ పెనుమత్స సాంబశివరాజు కుమారుడు సూర్యనారాయణరాజు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ. విజయనగరంలో అందరికీ ఈయన డాక్టర్ సురేష్‌బాబుగా సుపరిచితుడు. 2014లో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో తొలిసారిగా వైసీపీ జెండా మోసిన కుటుంబంగా పార్టీ అధిష్ఠానం గుర్తు పెట్టుకుంది.2019 సాధారణ ఎన్నికల్లో నెల్లిమర్ల నుండి మరోమారు తనకు గాని, తన కుమారునికి గాని వైసీపీ టిక్కెట్ ఇవ్వాలని సాంబశివరాజు కోరారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ ఆశ తీరకుండానే సాంబశివరాజు చనిపోయారు. తండ్రికి ఇచ్చిన హామీ మేరకు సాంబశివరాజు మృతి చెందిన కొద్దిరోజుల్లోనే సురేష్‌బాబును సీఎం జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేశారు. దాంతో జిల్లా వాసులు సాంబశివరాజు కుటుంబానికి న్యాయం జరిగిందని భావించారు. ఎమ్మెల్యే కాలేకపోయినా ఎమ్మెల్సీ అయినందుకు సురేష్ బాబు ఆనందించారు.
అక్కడే కథ మొదలైంది ..
సురేష్ బాబు ఎమ్మెల్సీ అవ్వడంతోనే కథ మొదలైంది. జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు సురేష్‌బాబును కావాలనే దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడ ఇవ్వడం లేదని వినికిడి. ఒకప్పుడు తన తండ్రి సాంబశివరాజు చక్రం తిప్పిన నెల్లిమర్లలోనూ ఆయనకు తగిన ఆదరణ లభించడం లేదనే భావన ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది. అంతే కాకుండా జిల్లాకు ఎవరైనా మంత్రులు వచ్చినా.. పర్యటించినా ఎమ్మెల్సీ సురేష్‌బాబుకు సమాచారం అందడం లేదని పెన్మత్స అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ తెరపైకి వస్తారేమోనని ..
సురేష్‌బాబు ఎమ్మెల్సీ పదవీ కాలం 2023 మార్చి వరకు ఉంది. ఒకవేళ ఆయనకు ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తే 2024 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వస్తారనే అనుమానాలు వైసీపీలోని వేరొక వర్గానికి బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గర బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఒకవేళ నెల్లిమర్లలో ఎమ్మెల్సీకి ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో తన మనుగడకు ఇబ్బందవుతుందనే ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం సురేష్‌బాబును ప్రజలకు దూరం పెడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి లెక్కలు ఎలావున్నా సీఎం జగన్ గుర్తించినా, సొంత పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
మౌనం వెనుక మర్మమేంటో..
ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్న సురేష్ బాబు మౌనం వహిస్తుండటంలో మర్మమేదో ఉందని స్థానికులు భావిస్తున్నారు. సురేష్‌బాబు కౌంటర్ అటాక్ మొదలు పెడితే మాత్రం జిల్లాలో, ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో రాజకీయ దుమారం చెలరేగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి అలా లేకపోయినా పరిస్థితి ఇలానే కొనసాగితే ఆధిపత్య పోరు తప్పక పోవచ్చనే భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.











