సాగునీటి ప్రాజెక్టుల వ్యయం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం బెడిసి కొట్టేలా ఉంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,300 కోట్లు మించి ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం కన్నా పునరావాసం, పరిహారానికి ఎక్కువ ఖర్చు కానుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, పునరావాసంతో కలుపుకుని రూ.55 వేల కోట్లకు చేరింది.
అయితే కేంద్రం మాత్రం 2014 ఖర్చుల ప్రకారం పోలవరానికి రూ.20,300 కోట్లు మించి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కేంద్రం మరో ట్విస్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్ టెండర్ విధానం వల్ల పోలవరం ప్రాజెక్టులో ఆదా అయిన వెయ్యి కోట్లకు కూడా కోత వేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించిందనే సమాచారం వైసీపీ అధినేతను కలవరపెడుతోంది.
రివర్స్ అయిందా?
టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రచారం చేసిన వైసీపీ నేతలకు అధికారంలోకి వచ్చాక విషయం తెలిసివచ్చింది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని చంద్రబాబునాయుడు రూ.55 వేల కోట్లకు పెంచి దోచుకుంటున్నారని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత కేంద్రానికి లేఖలు రాశారు. ఆ లేఖలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి శాపంగా మారాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్రం మాత్రం రూ.20,300 కోట్లే ఇస్తామని చెప్పడంతో ఏపీ ప్రభుత్వానికి మింగుడు పండటం లేదు. ఏపీ జీవనాడిగా చెప్పుకుంటోన్న పోలవరం ప్రాజెక్టు, కేంద్ర సహకారం లేకుంటే గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోలవరం సాధనకు వైసీపీ ఎంపీల రాజీనామా
పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని కేంద్రం ఇవ్వకపోతే ఏం చెయ్యాలనే దానిపై వైసీపీ అధినేత తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకువస్తానని ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసిన వైసీపీ అధినేత కేసుల మాఫీ కోసం మోడీ వద్ద మెడలు వంచారనే విమర్శలు వస్తున్నాయి.
ఇక పోలవరం విషయంలో కేంద్రం పూర్తి ఖర్చులు భరించేందుకు ముందుకు రాకుంటే, వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ఎంపీల రాజీనామా పేరుతో అల్టిమేటం జారీ చేసి, రాజకీయ ప్రహసనం నడిపిస్తారా? లేదంటే నిజంగా రాజీనామా చేసి, ఎన్నికలకు వెళతారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.