దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని అనుసరించి అధికార పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పార్టీలు గ్రేటర్‌పై దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల స్కెచ్ స్టార్ట్ చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి బయట పడాలని చూస్తూ అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది. ఇటీవల వరదలతో టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయ పడుతుండగా అదేమి పట్టించుకోని అధిష్టానం ఎన్నికలను నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
వరద సాయం ముంచేనా.. తేల్చేనా
వరద బాధితులకు చేసిన రూ.10 వేల ఆర్థిక సాయం పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొందరు భావిస్తున్నారు. సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాము చేసిన ఆర్థిక సాయం కాస్త ఊరట నిచ్చిందని అంటున్నారు. అయితే వారం రోజుల పాటు వరద సాయం పంపిణీ చేసిన సర్కార్ ఆ తర్వాత నిలిపి వేస్తున్నట్టు ఏకంగా మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో నగరంలోని వరద బాధితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దీంతో బాధితులందరికీ వరద సాయం అందించాలని నిర్ణయించినట్టు కేటీఆర్ ప్రకటించడంతో దీంతో ఆందోళనలు కాస్త తగ్గు మొఖం పట్టాయి. కేవలం వరద సాయం చేసినంత మాత్రాన ప్రజలు టీఆర్ఎస్‌కు ఓట్లేస్తారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఏర్పాట్లు చేసుకుపోతున్న ఎన్నికల కమిషన్..
పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతున్నా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ తమ పని తాము చేసుకుపోతోంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఇక ఎన్నికల నిర్వహణకు గడువు సమీపిస్తున్నట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన వెంటనే ఏ క్షణంలో అయినా ఎన్నికలు నిర్వహిచేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఇస్తోంది. ఈ నెల 10వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత గ్రేటర్ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావం ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, తమ ఏర్పాట్లు చకచక చేసుకుంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.