తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తే, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మరో కొత్త ప్రపంచం వైపు దృష్టిసారించబోతున్నాడు. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మించబోయే సినిమా ఈ కొత్త ప్రపంచానికి తెరతీయబోతున్నాట్టు సమాచారం. చారిత్రక కథాంశం నుంచి తెలుగు కథ భవిష్యత్తు వైపు పయనించబోతోందన్న మాట. 2050లోకి కాలంతో సాగే పయనంతో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా సినిమా పరిథిని మించి ఉండేలా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
దాదాపు ఏడాది కాలంగా ఈ కథపైనే కసరత్తులు సాగుతున్నాయి. ఈ కథ విషయంలో ఆదిత్య 369 లాంటి సినిమా రూపొందించిన సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ల సలహాలు సంప్రదింపులు తీసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. మరో దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. వీరితోపాటు కె. రాఘవేంద్రరావు సలహాలు తీసుకోకుండా నిర్మాత అశ్వనీదత్ ఉండరు. అందరూ కలిసి ఈ కథను కొలిక్కి తెచ్చారని వినికిడి. కాకపోతే సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నట్టు కూడ సమాచారం ఉంది.
టైమ్ మిషన్ నేపథ్యంలో భవిష్యత్తులోకి తీసుకెళ్లి మరో అద్భుతమైన ప్రపంచాన్నితీసుకెళ్లాలంటే ఎక్కువగా సీజీ వర్క్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. హీరో టైమ్ ట్రావెల్ చేసి 2050లోకి వెళతాడట. ఇందులో కరోనాని కూడా ఇన్వాల్వ్ చేస్తారేమోననే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. హీరో కాలంలోకి ఎందుకు ప్రయాణించవలసి వస్తుందనేదే ఇందులోని కీలక పాయింట్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీపొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు సమాచారం. కథ మీద ఎక్కువగా కసరత్తులు చేయడానికి కూడా ఈ కరోనా సమయం బాగా హెల్ప్ అయ్యింది.
భారీ తారాగణంతో..
ఈ సినిమాలో భారీ తారాగణం తప్పదని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే కీలక పాత్రల్ని పోషించబోతున్నారు. వీరు కాక బాలీవుడ్ నుంచి ఇంకా చాలామంది తారలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ హీరోనే ఇందులో విలన్ అనే ప్రచారం కూడా ఉంది. మొత్తం 10 మంది వరకూ బాలీవుడ్ నటులు ఉండొచ్చని తెలుస్తోంది. మొదట్లో దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రారంభించినా పాన్ వరల్డ్ గా మారే అవకాశం లేకపోలేదు. అలా కావాలి అంటే ఓ హాలీవుడ్ నటుడ్ని కూడా తీసుకురావల్సి ఉంటుంది.
ఇందులో నటీనటులకు ఇచ్చే పారితోషికాలే దాదాపు 200 కోట్ల వరకూ ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. అంటే సినిమా బడ్జెట్ ఎంత ఉండొచ్చో ఊహించుకోండి. వైజయంతీ మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మించబోతోంది. వచ్చే ఏడాది తన డేట్స్ అన్నీ ఈ సినిమాకే ప్రభాస్ కేటాయించాడని అంటున్నారు. సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.











