ఉప ఎన్నిక కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వరాల జల్లు కురుస్తోంది. ఇప్పటికే లెక్కలేనన్ని వరాలు ఆ నియోజకవర్గానికి దక్కగా.. సోమవారం ఒక్కరోజే ఆ నియోజకవర్గ పరిధిలో మొదలైన దళిత బంధుకు రూ.500 కోట్లతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత వకుళాభరణం కృష్ణ మోహన్ కు బీసీ కమిషన్ చైర్మన్ గిరీ దక్కేలా చేసింది. వెరసి ఒక్క దళిత బంధు కోసమే హుజూరాబాద్ కు ఇప్పటిదాకా రూ.1,000 కోట్లు విడుదల కాగా.. దానికి అదనంగా బీసీ కమిషన్ పదవి దక్కింది. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈటలను ఓడించి తమ సత్తా చాటాలని భావిస్తున్న టీఆర్ఎస్ సర్కారు.. చేతికి ఎముకే లేదన్న రీతిలో హుజూరాబాద్ కు వరాల జల్లు కురిపిస్తోంది.
ఇంకో వారంలో మరో వెయ్యి కోట్లంట
హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ గెలిచి తీరాలన్న దిశగా సాగుతున్న సీఎం కేసీఆర్.. కొత్తగా దళిత బంధును ప్రకటించి.. ఆ పథకాన్ని తొలుత హుజూరాబాద్ పరిధిలోనే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ పథకం కోసం రూ.500 కోట్లను విడుదల చేసిన కేసీఆర్ సర్కారు.. తాజాగా సోమవారం నాడు మరో రూ.500 కోట్లను విడుదల చేసింది. ఇక ఈ పథకం అమలు కోసం ఇదే నియోజకవర్గానికి మరో వారంలో మరో రూ.1,000 కోట్లను విడుదల చేయనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. వెరసి కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ పథకం అమలుకు హుజూరాబాద్ కు రూ.2,000 కోట్లను విడుదల చేసినట్టు అవుతుంది. ఈ మొత్తం కేవలం దళిత బంధుకు మాత్రమే కేటాయించగా.. ఇతరత్రా అభివృద్ధి పనుల కోసం మరింత మేర నిధులను విడుదల చేయనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ పరిధిలో వివిధ పనుల కోసం రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సీటు దక్కనోళ్లకు నామినేటెడ్ పోస్టులు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా తమను ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో పాటుగా ఉప ఎన్నికను అనివార్యం చేసిన ఈటల రాజేందర్ ను ఏకాకిని చేసే దిశగా ఆయన వెంట ఉన్న వాళ్లనంతా టీఆర్ఎస్ లాగేస్తోంది. ఈ క్రమంలో ఆయా నేతలకు నామినేటెడ్ పదవులను ఎరగా వేస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతగా వకుళాభరణం కృష్ణమోహన్ కూడా అందరిమాదిరే హుజూరాబాద్ టికెట్ ను ఆశించారు. అయితే ఈటలను ఆయన సామాజిక వర్గం నేతతోనే ఓడించేలా ప్లాన్ రచించిన కేసీఆర్.. పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో పార్టీలో ఏమాత్రం అసంతృప్తి రావద్దన్న భావనతో వకుళాభరణం కృష్ణమోహన్ ను ఉన్నపళంగా బీసీ కమిషన్ కు చైర్మన్ గా ప్రకటించారు. వకుళాభరణంతో పాటు ఓ ముగ్గురు నేతలను కూడా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఉప ఎన్నిక జరిగేలోగా ఇంకెన్ని పదవులు హుజూరాబాద్ కు దక్కనున్నాయోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- కొండా సురేఖ ఓకే.. మిగిలిన ఇద్దరెవరు?