థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏది నిజమో, ఏది భ్రమో తెలియనంతగా.. నేడు సినిమా మేకింగ్ టెక్నాలజీ కొత్త టర్న్ తీసుకుంది. దాని పేరు వర్చువల్ రియాలిటీ. ఇప్పటివరకూ హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ సరికొత్త టెక్నాలజీ .. మొట్టమొదటిసారిగా ఇండియాలో కూడా పరిచయం కాబోతోంది. అది కూడా ఒక మలయాళ సినిమాతో. మాలీవుడ్ యంగ్ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి గోకుల్ రాజ్ భాస్కర్ దర్శకుడు.
గతేడాది, ఈ ఏడాది వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు పృధ్విరాజ్ సుకుమారన్.
ప్రస్తుతం ‘ఆడుజీవితం’ అనే మూవీలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు జోర్డాన్ లో చిత్రీకరణ ప్రారంభించిన ఆ చిత్ర యూనిట్.. లాక్ డౌన్ లో సైతం షూటింగ్ కొనసాగించి వార్తల్లో నిలిచింది. తాజాగా పృధ్విరాజ్ తన ట్విట్టర్ అకౌంట్లో.. తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన వార్త ట్వీట్ చేసి సంచలనాలకు తెరతీశాడు. అలాగే ఒక పోస్టర్ కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఫిల్మ్ మేకింగులోనే ఇదొక గొప్ప కళ.. అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉతేజాన్నిచ్చే కొత్త అధ్యాయం.. అందుకోసం ఎదురుచూస్తూ ఉండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్ధతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అప్డేట్స్ కోసం వేచి ఉండండి” అంటూ పోస్టర్ కింద మెన్షన్ చేశాడు.
అందులో పృధ్విరాజ్ ఓ యోధుడిగా కనిపిస్తున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా ఇండియాలోని మొట్టమొదటి వర్చువల్ సినిమాగా ఆసక్తిని కలగజేయడంతో పాటు .. పాన్ ఇండియా కేటగిరిలో .. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతోంది. లాస్టియర్ ‘మామాంగం’ అనే సినిమాతో మలయాళ సినిమా తొలిసారిగా పాన్ ఇండియా కేటగిరిలో సినిమాను విడుదల చేయడం ప్రారంభించింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఆ సినిమా అంతగా విజయం సాధించలేకపోయింది. నష్టాన్ని కూడా చవిచూసింది. అయినప్పటికీ పృధ్విరాజ్ .. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ వర్చువల్ మూవీమీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు.
కథ పరంగా.. మేకింగ్ పరంగా.. చాలా జాగ్రత్తలు తీసుకొని.. మాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ మెగా బ్లాక్ బస్టర్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. మలయాళ పరిశ్రమలో ఇప్పటివరకూ ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి కానీ.. బాహుబలి రేంజ్ భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ఆ లోటును ఈ సినిమాతో తీర్చాలనే పట్టుదలతో ఉన్నాడు పృధ్విరాజ్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను లాంచ్ చేసి.. రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్ళే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్. లాస్టియర్ లూసిఫర్ తో దర్శకుడిగా మారిన పృధ్విరాజ్ కు .. ఆ తర్వాత అన్నీ సూపర్ హిట్స్ రావడంతో.. మంచి ఉత్సాహంతో ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశాడు. మరి ఈ మూవీ అతడి రేంజ్ ను ఏమేరకు పెంచుతుందో చూడాలి.











