భారతీయ జనతా పార్టీకి అందరికంటె మించిన ట్యాగ్ లైన్ ఒకటి ఉంది. ‘మాది క్రమశిక్షణ గల పార్టీ’ అనేదే ఆ ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ ముసుగులో తమకు ఇష్టం లేని విషయాల్లో ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికైనా వారికి అధికారం ఉంటుంది. అదే పద్ధతిలో పార్టీ ఇప్పుడు ఓ సీనియర్ లీడర్ పై వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు లంకా దినకర్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.
లంకా దినకర్- గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. టీవీ డిస్కషన్లలో పాల్గొనే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ గా ఆయనకు పేరుంది. తనకు పట్టున్న విషయాలపై టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆ రకంగా లంకా దినకర్ కు మంచి గుర్తింపు ఉంది. ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో దినకర్ కూడా బీజేపీలో చేరారు. అయితే ఇదివరకటినుంచి మీడియాకు అందుబాటులో ఉండే, సబ్జెక్టు గురించి మాట్లాడే నాయకుడు కావడం వల్ల మీడియా వారు చాలా సందర్భాల్లో ఆయన అభిప్రాయాలను తీసుకుంటూ ఉండడం ఎప్పటిలాగానే జరుగుతూ వచ్చింది.
అయితే ఈ వ్యవహారం బీజేపీ పార్టీ యాజమాన్యానికి కంటగింపుగా మారింది. లంకా దినకర్ చాలా స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించడం కూడా వారికి నచ్చలేదు. పార్టీ ఒక వైపు వైఎస్సార్ కాంగ్రెస్ తో అంటకాగడానికి సిద్ధపడుతున్నట్లుగా సంకేతాలు పంపుతున్నప్పటికీ.. లంకా దినకర్ వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడడాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోయారు.
సస్పెన్షన్ లేటైందా..
తెలుగుదేశం నుంచి వచ్చిన లంకా దినకర్ పై సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పటికే లేటైందని పార్టీ నాయకులు అంటున్నారు. సోము వీర్రాజు చాలా కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకింది. మామూలుగా అయితే.. ప్రతి చిన్న విషయానికీ యాక్టివ్ గా రాజకీయాల్లో ఉంటూ దూసుకుపోతూ ఉండే వీర్రాజు.. గళం వినిపించి నెలకు పైగానే అయింది.
వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లును సమర్థించుకుంటూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ఏపీలో పర్యటించినప్పుడు కూడా.. సోము వీర్రాజు ఆ ట్రిప్ లో పాల్గొనలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేకుండానే కేంద్ర మంత్రి పర్యటన ముగిసిపోయింది.
అప్పటికే సోము వీర్రాజుకు కరోనా సోకడంతో.. ఆ విషయం ఎక్కడా ప్రకటించకుండానే ఆయన చికిత్స తీసుకున్నారు. చికిత్స నుంచి డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకుంటుండగా.. మరికొన్ని రోజులకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కాంటినెంటల్ ఆస్పత్రినుంచి పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఏషియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి కూడా మారారు. అక్కడ పరిస్థితి కుదుట పడిన తర్వాత.. రెండు రోజుల కిందటే డిశ్చార్జి అయినట్టు తెలుస్తోంది. ఆస్పత్రినుంచి బయటకు రాగానే.. ఆయన ఏపీలో పార్టీని ఉద్ధరించడానికి ఆపరేషన్ మొదలెట్టిన సంకేతంలాగా.. లంకా దినకర్ మీద సస్పెన్షన్ వేటు వేసినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. (ఇదీ చదవండి : సోము వీర్రాజు పై పెరుగుతున్న అసమ్మతి)
లంకా దినకర్ కు ముందుగా షోకాజు నోటీసు కూడా ఇచ్చారు. ఆస్పత్రిలో ఉండగానే సోము వీర్రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఇలా ఆస్పత్రినుంచి బయటకు రాగానే.. అలా సస్పెన్షన్ వేటు పడింది. లంకా దినకర్ తిరిగి తెలుగుదేశంలోనే చేరుతారనే టాక్ బయట వినిపిస్తోంది.











