ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఒక్క రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండు రాష్ట్రాలు అయ్యాక.. దాదాపుగా ఎవరి పరిధుల్లో ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి ఏపీ నేతలు మాట్లాడరు. ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ నేతలు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి వీహెచ్ హనుమంతరావు. అయితే..
ఉద్యమం నాటి మాటే నా మాట
విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉండాలన్న ఉద్యమం నాటి నినాదానికి తగ్గట్లు ఆయన వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ రాజకీయాల గురించి.. అక్కడ చోటు చేసుకునే పరిణామాల గురించి తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వీహెచ్.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు.. ఆత్మీయపూర్వక వార్నింగ్ ఇచ్చేశారు. ఆ మాటకు వస్తే.. చాలామంది తెలంగాణ నేతలకు ఉన్నట్లే వీహెచ్ కు తిరుమల శ్రీవారి సెంటిమెంట్ ఎక్కువ. తిరుమలకు సంబంధించి ఏదైనా జరిగిందంటే.. వెంటనే స్పందించే వారిలో ఆయన ఒకరు.
దేవుడి సొమ్ము జోలికి వెళ్లోద్దు..
తాజాగా శ్రీవారి బంగారాన్ని కుదవపెట్టి ఏపీని డెవలప్ చేయాలంటూ వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేయోద్దు అంటూ జగన్ కు హితవు పలికారు. దేవుడి సొమ్ము జోలికి వెళ్లొద్దన్న మాటను అదే పనిగా చెప్పేస్తున్నారు. వాస్తవానికి తెలుగు ప్రజల వరకు వస్తే.. తిరుమల సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఎక్కడ ఎలా వ్యవహరించినా.. తిరుమల శ్రీవారి వద్దకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న పలువురు.. తిరుమలలో ప్రదర్శించిన అత్యుత్సాహంతో చాలా ఇబ్బందులు పడ్డారని కథలు కథలుగా వినిపిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్ని గుర్తు చేసేలా వీహెచ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
నీతో తిరిగి వడ్డీ చెల్లించుకుంటారు
ప్రపంచంలో పవిత్ర స్థలాలు అయిన వాటికన్ సిటీ తర్వాత తిరుమలే అన్న వీహెచ్.. ఆ స్వామి జోలికి మాత్రం వెళ్లొద్దని చెప్పటమే కాదు.. తాను చేయాల్సిన హెచ్చరికల్నికూడా చేసేశారు. స్వామి బంగారంతో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనను జగన్ విరమించుకోవాలని.. లేదంటే వడ్డీ కాసుల వాడు నీతో తిరిగి వడ్డీ చెల్లించుకునేలా చేస్తారన్నారు. ఇంత సూటిగా జగన్ కు హెచ్చరికలు జారీ చేసిన సీనియర్ నేత మరెవరూ లేరని చెప్పక తప్పదు. ఒకప్పుడు తనకు బాగా తెలిసిన వీహెచ్ మాటల్ని జగన్ ఫాలో అవుతారో లేదో?











