టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందు హజరయ్యారు. అధికారులు విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఇవాళ ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. దీంతో రంగంలోకి ఎన్సీబీ లోతుగా విచారణ చేపట్టింది. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పలు కోణాల్లో విచారించిన ఎన్సీబీ ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మొదట విచారణకు సహకరించని రియా ఆ తరువాత పలువురి పేర్లను బయటపెట్టింది. ఇదే సమయంలో టాలెంట్ మేనేజర్ జయ షా వాట్సాప్ చాటింగ్ ద్వారా నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో ఎన్సీబీ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లకు నోటీసులు జారీ చేశారు. ఎన్సీబీ అధికారులకు చెప్పిన మేరకు రకుల్ నేడు విచారణకు హజరయ్యారు. మరో నటి దీపికా పదుకొనె కూడా నేడు విచారణకు రానున్నారు. దీపికాతో పాటు తాను వస్తానని ఆమె భర్త రణవీర్ సింగ్ ఎన్సీబీ అధికారులకు తెలిపారు. ఎన్సీబీ అధికారుల నుంచి అనుమతి రాగానే ఆమె ఎన్సీబీ కార్యాలయానికి రానున్నారు. మరోవైపు సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లు శనివారం విచారణకు వస్తామని అధికారులకు సమాచారమందించారు. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పిన రకుల్ నుంచి ఎన్సీబీ అధికారులు ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారోనని ఆసక్తి నెలకొంది.











