కేంద్రం మీదకు నెపం నెట్టి తప్పించుకోవడం రాష్ట్రాలకు చాలా ఈజీ. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రయత్నం కూడా అదే.
వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు మీటర్లు బిగించడం అనే వ్యవహారం అనేది కేంద్రం యొక్క, కేంద్రం వలన, కేంద్రం కొరకు తీసుకున్న నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రజలకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ.. నిన్నమొన్నటిదాకా ఆ మాట చెల్లుబాటు అయింది. ఇప్పుడు ప్రజల్లో మళ్లీ భయాలు మొదలవుతున్నాయి.
వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగిస్తే.. భవిష్యత్తులో ఏదో ఒక రకమైన ఇబ్బంది తప్పదనే భయం రైతుల్లో ఉంది. ప్రస్తుతానికి మీ బిల్లులు మేమే చెల్లించేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఉచిత విద్యుత్తు పొందుతున్న ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని అంటోంది. ఇది నిజమే కావచ్చు. కానీ, రైతుల్లో పుడుతున్న భయాలను కొట్టి పారేయడానికి వీల్లేదు. మీటర్లు ఉంటే ముందు ముందు వినియోగానికి ఒక స్లాబ్ నిర్ణయిస్తారని, స్లాబ్ మించి వాడితే బిల్లు చెల్లించాల్సి వస్తుందని, కేంద్రం చెప్పే వివిధ నిర్వచనాల ప్రకారం సంపన్న వర్గాలకు చెందిన రైతులకు ఉచిత విద్యుత్తు ఆపేస్తారని భయాలున్నాయి. అలాంటివేమీ లేవని జగన్ ప్రభుత్వం అంటోంది. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది గానీ.. ఆ డబ్బును వారు సొంతానికి, ఇతర అవసరాలకు వాడుకునే వీలు కూడా ఉండదని వార్తలు వస్తున్నాయి. రైతుల పేరిట ఎస్క్రో ఖాతాలు ఏర్పాటుచేసి, ఆ ఖాతాల్లో ప్రభుత్వం వేసేలా, అటునుంచి అటే డిస్కమ్ లకు చెల్లింపులు జరిగేలా పద్ధతి వస్తుందని కూడా అంటున్నారు.
హరీష్ మాటలు వైరల్
ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తున్నా.. రైతుల్లో భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నమాటలు ఆంధ్రప్రదేశ్ రైతుల భయాల్ని మరింత పెంచాయి. కేవలం నాలుగు వేల కోట్ల రుణం కోసం ఆశపడి జగన్మోహన రెడ్డి, రైతులకు ఉరితాడు బిగిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఈ మీటర్ల నిర్ణయంతో రైతుల్ని ముంచేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా రెండున్నర వేల కోట్ల రూపాయల రుణం ఇస్తామని ఆశ పెట్టారని, అయితే రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కేసీఆర్ ఆ రుణాన్ని వద్దనుకున్నారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాటలు ఇప్పుడు ఏపీ అంతటా వైరల్ అవుతున్నాయి. రైతుల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. కేసీఆర్ వద్దనుకున్న ఆఫర్‌ను జగన్ నెత్తికెత్తుకోవడంపై ప్రజల్లో భయాలు పెరుగుతున్నాయి. నిజంగా రైతులకు ప్రమాదకరం కాని నిర్ణయం అయితే, కేసీఆర్ మాత్రం ఎందుకు దాన్ని తోసిపుచ్చుతారు.. అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
ప్రతిదీ కేంద్రంపై నెట్టేయలేరు!
ప్రజలు ప్రశ్నించిన ప్రతి విషయంలోను, మూలకారణం కేంద్రంపై నెపం నెట్టేసి పబ్బం గడుపుకోవాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కుదరదు. ఇవాళ మీటర్లు ఎందుకు పెడుతున్నారంటే.. కేంద్రం పెట్టమన్నది గనుక అంటున్న ప్రభుత్వంలోని పెద్దలు, రేప్పొద్దున సంపన్న రైతులకు కత్తిరింపులు మొదలైతే.. దానికి కూడా కేంద్రాన్నే కారణంగా చూపించగలరు. సగటు రైతుకు సంబంధించినంత వరకు ఇవాళ్టికి రేపటికి ఎలాంటి తేడా రానంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఏ చిన్న తేడా వచ్చినా, వ్యవసాయ విద్యుత్తుకు శ్లాబులు విధించినా, సంపన్న వర్గాల పేరుతో కత్తిరింపులు చేసినా.. రైతు వర్గాల్లో వ్యతిరేకత పెచ్చరిల్లుతుందనడంలో సందేహం లేదు. ఆ వ్యతిరేకత ప్రభావం.. నిర్ణయాన్ని అమలు చేసే రాష్ట్రప్రభుత్వం మీదనే పడుతుంది. పైగా, ఈ నిర్ణయం అమలు అనేది రాష్ట్రప్రభుత్వానికి ఇష్టముంటే తప్ప జరిగేది కాదని.. హరీష్ రావు మాటల ద్వారా క్లారిటీ కూడా వచ్చేసింది.
సీమ రైతుల పరిస్థితి ఘోరం
వ్యవసాయ విద్యత్తుకు మీటర్లు పెట్టడం అంటూ జరిగితే.. సీమరైతులకే ఎక్కువ నష్టం అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కేవలం మోటర్ల మీదనే ఆధారపడి బోర్లలోంచి నీటిని తోడి సేద్యం చేేసే దుస్థితి రాయలసీమలో మాత్రమే ఉంది. సంపన్న వర్గాలకు ఉచిత విద్యత్తు కత్తిరించడం లాంటి ఎన్ని నిబంధనలు పెట్టినా.. రాష్ట్రం మొత్తం మీద ప్రభావం సమానంగా ఉంటుంది. ఏదో ఒక కారణం చేత ఉచితం గా పరిగణించే విద్యుత్తుకు ఒక స్లాబ్ విధిస్తే గనుక.. సీమ రైతులు శిథిలమైపోతారు. సీమ భగ్గుమంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
.. సురేష్ పిళ్లె











