బండ్లు ఓడలు ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. హీరోలు విలన్ లు అవుతున్నారు.. విలన్ లు హీరోలవుతున్నారు. మా హీరోను ఏమన్నా అంటే కారాలు మిరియాలు నూరే అభిమానుల స్థానంలో ఆ విలన్ కు మాత్రం ప్రజలే పట్టం కట్టేస్తున్నారు.
ఎవరైనా కరోనా సంక్షేమానికి విరాళం ఇవ్వాలంటే సీఎంలకూ పీఎంలకూ కాదు సోనూ సూద్ ఫౌండేషన్ కు పంపండి అనేలా మారింది. దేశం వల్లకాడుగా మారుతుంటే తమవల్ల కాదంటూ కాడి పారేసిన నేతలున్నారు.. తనకా శక్తి లేకపోయినా కాడి భుజానకెత్తుకుని మోస్తున్న సోనూ సూద్ మాత్రం ఒకే ఒ్రక్కడు. ఆయన చేసే పనులు చూస్తుంటే కొంతమంది రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్… మరికొందరు హీరోల గుండెల్లో విమానాలు పరుగెడుతున్నాయ్. రాజకీయ పార్టీలు పెట్టి కోట్లు తగలేసినా జనం ఓట్లు వేయలేదు. ప్రజల హీరోగా మారిన ఈ విలన్ ని ‘నువ్వే రేపటి ప్రధానివి’ అంటున్నా తనకవేవీ వద్దంటున్నాడు.
‘మరి నీకు ఇదంతా అవసరమా.. ఇంట్లో గదిలో ఓ మూలన పడి ఉండక మాకెందుకీ తిప్పలు తెచ్చిపెడుతున్నావ్’ అని మనసులో కొందరు హీరోలు తిట్టుకోవచ్చు. వారు మింగలేక కక్కలేక అన్నట్లుగానే వాస్తవ పరిస్థితి ఉంది. పోనీ ఆయన చేసే సాయం ఏమన్నా దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగిన చందంలా ఉందా అంటీ అదీ కాదు. ఆగమేఘాల మీద ఇంటికొచ్చి పడుతోంది. ఆయన చేతిలో ఏ మంత్రదండమూ లేదు.. యంత్ర దండమూ లేదు. జనానికి మాత్రం అతన్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. ఏమాయ చేస్తున్నావు సోనూ. జనాన్ని నమ్మించడానికి గెడ్డాలూ లేవు.. నీ సేవలకు ఏదీ అడ్డమూ రావడం లేదు.
నిజంగా రాజకీయాల్లోకి వస్తాడేమోనన్న భయంతో ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ మాదిరిగా పద్మవ్యూహంలోకి నెట్టేస్తారేమోనని కూడా సోనూ ఆలోచించడమూ లేదు. అతని ముందు ఉన్నదంతా కరోనా క్రైసిస్సే. కళ్లముందు ఓ ఆఫ్ట్రాల్ గాడు ఎదిగిపోతుంటే ఎవడికైనా కడుపు రగిలిపోదూ. అలా కడుపు రగిలిపోయే జాబితాలో రాజకీయ నాయకులూ ఉండొచ్చు.. సినిమాల్లో తనను చావబాదిన హీరోలూ ఉండొచ్చు. ‘సోనూ సార్.. నా ఫ్రెండ్ కు అర్జంట్ గా రెమిడిసివర్ ఇంజక్షన్ కావాలి’ అంటే క్షణాల్లో అక్కడికి ఆ ఇంజక్షన్ చేరిపోతోంది. అనామకుడు అడిగినా క్రికెట్ దిగ్గజాలు అడిగినా 24 గంటలూ స్పందిస్తున్న ఒకే ఒక్కడు సోనూ సూద్.
సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు సైతం సోనూ భజన చేస్తున్నారంటే అతను మనుషుల్లో దేవుడనేగా అనుకోవాలి. ఆక్సిజన్ కొరత ఉందని తెలిసి ఏకంగా ఆక్సిజన్ ప్లాంటే పెట్టాలనుకుంటున్నాడు అంటే అతను వ్యక్తా లేక శక్తా? ఇప్పటిదాకా అయన ఒంటికి రాజకీయ బురద మాత్రం అంటలేదు. అంటుకుంటే మాత్రం అందుకే ఇదంతా చేస్తున్నాడు అంటూ బురదజల్లే ప్రయత్నాలూ జరుగుతాయి. అతన్ని చేరుకోడానికీ, ప్రసన్నం చేసుకుని, పదవులు ఆశ చూపి తమ పార్టీలో చేర్చుకోడానికీ ప్రయత్నించే రాజకీయ పార్టీలు ఉండిఉండవచ్చు. అయినా అతను కడిగిన ముత్యమే.
సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారంటే అతని శక్తియుక్తుల్ని మెచ్చుకోక తప్పదు. మనుషుల్లో ఇలాంటి గుణం ప్రసాదించే వ్యాక్సిన్ వస్తే ఎంత బాగుంటుంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంతూళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలోనూ సాయం చేస్తూ దేవుడిలా మారిపోయారు.
‘ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుళ్లందరినీ మొక్కితే కాపాడుతారో లేదో తెలియదు గాని మన సోనూసూద్ అన్నకి ట్విట్టర్లో ఒక మాట చెప్తే చాలు మన బాధ మొత్తం తీరుస్తాడు నా రియల్ హీరో సోనూసూద్ . నిన్ను కలిసిన ప్రతి సారీ నువ్వు చెప్పిన ప్రతి మాటా ఏదో సాధించాలన్న కసీ నాలో నింపావన్నా.. వచ్చే జన్మలో కూడా ఈ పేద వాళ్ళ కష్టాలు నువ్వే తీర్చాలన్నా’ ఆయన మీద ప్రశంసల జల్లు కురిపిస్తుంటే అంతకంటే ఏంకావాలి. ఓ అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి తనకు పింఛనుగా వచ్చే సొమ్మును కూడబెట్టి సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిందంటే రియల్ హీరో ఎవరో అర్థమైంది కదా.
ఆమెలోని ఆ దానగుణాన్ని చూసి సోనూ తన దృష్టిలో అత్యంత శ్రీమంతురాలు ఆమేనంటూ కితాబిచ్చారు సోనూ. ఒకరి బాధను చూడటానికి కంటి చూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారాయన. అభిమానం అంటే హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం కాదు.. జనం కష్టసుఖాలు చూడాలి. కూడబెట్టిన జనం డబ్బును జనం కోసమే వెచ్చించాలి… అదే నిజమైన హీరోయిజం.. అదే నిజం.