ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. సరైన వైద్య సదుపాయాలు అందక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే.. మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సినీ సెలబ్రిటీస్ వారికి ఆసన్న హస్తం అందిస్తున్నారు. సోనూ సూద్, చిరంజీవి, తమిళ హీరో సూర్య ఫ్యామిలీ కోవిడ్ బాధితులకు రకరకాలుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సీనియర్ హీరో బాలయ్య కూడా వచ్చి చేరారు.
నందమూరి బాలకృష్ణ ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం తన బసవతారకం ట్రస్ట్ ద్వారా ఎందరికో వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన .. కోవిడ్ కష్టకాలంలో సైతం ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
రూ. 20లక్షల విలువ కలిగిన కోవిడ్ మందుల కిట్స్ కొనుగోలు చేసి.. హైద్రాబాద్ నుంచి హిందూపూర్ పంపించారు. స్థానిక నాయకులు వాటిని కరోనా బాధితులకు పంపిణీ చేశారు. కోవిడ్ తో బాధపడే ఎవరికైనా తమ కార్యాలయానికి వస్తే మందులు అందించాలని వారికి సూచించారు బాలయ్య. ఇప్పటికే ఎంతో మంది వాటిని అందుకున్నారు. ఇంకా అవసరమైతే పంపిస్తానని వారికి చెప్పారు.











