వైఎస్ఆర్ సీపీలో నెమ్మదిగా అసమ్మతి రాగం కనిపిస్తూ ఉంది. ఒంగోలుకు చెందిన వైఎస్ఆర్ సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కొద్ది కాలంగా సొంత పార్టీకి ఝలక్ ఇచ్చే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య భూస్కాంలపై అనుమానాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేయడం, జిల్లా ఎస్పీపై సీఎంవోకు ఫిర్యాదు చేయడం, తన గన్ మెన్‌నూ వెనక్కి పంపేస్తూ డీజీపీకి లేఖ రాయడం వంటివి జరిగాయి. తాజాగా బాలినేని నుంచి కాస్త అసమ్మతి స్వరం ఎక్కువగానే వినిపించింది.
ఒంగోలులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు ముందే తెలుసని, దానిపై రూ.50 లక్షలు పందెం కాశానని అన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే, ఇక్కడ (ఏపీలో) వైసీపీ గెలుస్తుందని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా చెబుతున్నాడని అన్నారు. తనకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా కానీ, రూ.50 లక్షల పందెం నుంచి తప్పుకున్నానని అన్నారు. తమకు జగన్ అంటే అంత ప్రేమ అని, తమ పైన కూడా జగన్ కు ప్రేమ ఉండాలి కదా అని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఏపీలో జగన్ ఓడిపోతారనేది బాలినేని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్తున్నారంటూ చర్చ సాగుతోంది.
ఇంకా మాట్లాడుతూ.. తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, 2 సార్లు మంత్రిగా చేశానని అన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా తాను ఎక్కడా రూపాయి కూడా తీసుకోలేదు.. ఎక్కడా అవినీతికి పాల్పడలేదని చెప్పారు. అలాగని తాను నీతిమంతుడ్ని అని చెప్పనని దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బులు తీసుకున్నానని, తనకు కూడా ఖర్చులుంటాయి కదా అని మాట్లాడారు. పైగా పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి అధ్యక్షులు తన కోసం సక్రమంగా పని చేయడం లేదని బాలినేని వ్యాఖ్యానించారు. వారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని, కనీసం ఓటర్ల జాబితాలను కూడా పరిశీలించటం లేదని అసహనం వ్యక్తం చేశారు. వారంతా అండగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు.
ఈ వ్యాఖ్యలే తాజాగా వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీలో సీనియర్ గా ఉన్న బాలినేని తరచూ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారనేది అధిష్ఠానానికి అంతు పట్టడం లేదు. రెండేళ్ల క్రితం ఏపీ కేబినెట్ నుంచి తొలగింపునకు గురైన తర్వాత వైసీపీని వీడతారని ఊహాగానాలు వచ్చాయి. టీడీపీ లేదా జనసేనతో కలిసి నడుస్తారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ పుకార్లను బాలినేని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాజా వ్యాఖ్యల్లోనూ తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాకపోతే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తనకు అండగా ఉంటేనే పోటీ చేస్తానని చెప్పారు. ఆయన వ్యవహారంతో అసలు వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానంతో బాలినేనికి సఖ్యత చెడిందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.











