నాచురల్ స్టార్ నాని – ఇప్పుడు ఓటీటీలో ప్రముఖంగా వినిపిస్తున్న సినిమా పేరు వి. థియేటర్లలో విడుదల కావలసిన నాని, సుధీర్ బాబుల కాంబినేషన్ లో తెరకెక్కిన వి సినిమా మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. కరోనా పరిస్థితులు లేకుంటే ఉగాది నాడే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ఈ సినిమాలో తన పాత్ర, ఇతర విశేషాలను నాని వివరించారు. అవేమిటో చూద్దాం.
* నా సినిమా మొదటిసారిగా ఓటీటీలో విడుదల కావడం కొత్త ఎక్స్ పీరియన్స్. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇదొక్కటే దారి… వేరే గత్యంతరం లేదు. ఈ విడుదల గురించి అందరం ఎక్సియిట్ మెంట్ తోనే ఉన్నాం. నాలుగేళ్ల తర్వాత కూడా ఈ ఎక్స్ పీరియన్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
* ఇంద్రగంటి మోహనకృష్ణతో 25 సినిమా చేయడం అనేది కాకతాళీయమే. అనుకోకుండా అలా కలిసివచ్చింది. ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డాం. మా ఇద్దరిలోనూ ఎలాంటి మార్పూ లేదు. అంతా సేమ్ టు సేమ్. ఇంద్రగంటిని చూస్తుంటే నా క్లాస్ మేట్ లాగా అనిపిస్తుంటుంది. మేం కలుసుకోవడంలో మధ్యలో గ్యాప్ వచ్చినా నిన్ననే కలిశాం అనేలా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు నాని కనిపించడు… ఇంద్రగంటి మోహనకృష్ణే కనిపిస్తాడు.
* నాచురల్ స్టార్ గా నన్ను ప్రేక్షకులు అంగీకరించడం నా అదృష్టం. మున్ముందు కూడా మంచి సినిమాలతో ఇలాగే కంటిన్యూ అవుతానన్న నమ్మకం ఉంది.
* ఈ సినిమా అష్టాచమ్మా విడుదలైన సెప్టెంబరు 5నే విడుదల కావడం అన్నది కేవలం కాకతాళీయం. ఈ తేదీన విడుదల కావడం అనేది అమెజాన్ వాళ్ల నిర్ణయం. ఒకవిధంగా ఇది మాకు లక్కీ అనుకోవాలి.
* ఈ పాత్ర అన్ ప్రిడిక్టబుల్ పాత్ర. దీని కోసం ప్రత్యేకంగా కష్టపడిందేమీ లేదు. నేను ఎక్స్ ట్రా ఎఫెర్ట్ ఏమీ పెట్టలేదు. కాకపోతే ప్రతి సన్నివేశం తీసేముందు దర్శకుడితో డిస్కషన్ అవసరమయ్యేది. ఇందులో నా నవ్వు చాలా ప్రత్యేకంగా ఉందని అందరూ అంటున్నారు. ట్రైలర్ విడుదలయ్యాక ఈ నవ్వు గురించే అందరూ మాట్లాడుతున్నారు. ప్లాన్ చేసుకుని అలా నవ్వలేదు… అదలా వచ్చేసంది అంతే.
* సినిమా ప్రారంభమైనప్పుడు ఈ పాత్ర గురించి పెద్దగా రివీల్ చేయలేదు. సినిమా అంతా ఈ పాత్ర ఉంటుంది. దాని టైమింగ్ అసక్తికరంగా ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పాత్ర గురించి.
* నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను జనం చూస్తారా అని అసలు అనుకోవద్దు. ఎందుకంటే బ్యాడ్ బాయ్స్ నే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రానా, సోనూ సూద్ లను ఇష్టపడటం లేదా… ఈ పాత్ర కూడా అంతే.
* వి సినిమాని ఉగాదికే విడుదల చేద్దాం అనుకున్నాం… కుదరలేదు. నాలుగు నెలలు గడిచిపోయింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనిపించింది. కరెక్ట్ టైమ్ లో కరెక్టు నిర్ణయం తీసుకున్నాం.
* నా కోస్టార్ సుధీర్ చాలా బాగా చేశాడు. ఏ సినిమా అయినా నేను మల్టీ స్టారర్ లా చూడను. అదొక పాత్ర, ఇదొక పాత్ర… అంతే అనుకుంటాను. ఇంతకుముందు నాగార్జునతో చేసినపుడు కూడా అలానే ఫీలయ్యాను… ఇప్పుడు సుధీర్ తోనూ అలాంటి ఫీలింగే ఉంది. సుధీర్ చాలా బాగా నటించాడు.
* రక్షక భటుడికీ, రాక్షసుడికీ మధ్య జరిగే వార్ లా దీన్ని భావించవద్దు. స్ర్టయిట్ నెరేషన్ లోనే దర్శకుడు కథ చెప్పారు. ఇందులో ట్విస్టులంటూ ఏమీ ఉండవు. ఓ సెలబ్రిటీ కాప్ జీవితంలోకి ఒకడొస్తాడు… ఆ తర్వాత అతని జీవితం ఏమైంది అనేదే కథ. కథనంలో మంచి గ్రిప్పింగ్ ఉంటుంది. ఈ రాక్షసుడు మంచి రాక్షసుడు అని చెప్పలేను… కాకపోతే అతను చేసే పనులు చాలా బ్రూటల్ గా ఉంటాయి. ఈ నెగిటివ్ రోల్ ఎందుకు చేశానో సినిమా చూశాక మీకు అర్థమవుతుంది.
* ఈ కరోనా సమయంలో మా అబ్బాయి జున్ను నాకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చాడు. నా కోసమే ఈ పాండమిక్ వచ్చిందేమో అనిపించింది. వాడిని వదిలి ఉండలేకపోతున్నా. బయటికి వెళుతుంటే చాలు ఎక్కడికి? ఎందుకు? అనే ప్రశ్నలు వేసేస్తున్నడు.
* ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయటానికి చాలా తర్జనభర్జనలు జరిగాయి. పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాత దిల్ రాజుగారు కూడా అంగీకరించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి అందరి సలహాలు తీసుకోవలసిన అవసరముంది. అందరికీ జవాబు చెప్పల్సిన బాధ్యత ఆయనదే కాబట్టి అందరి సలహాలు తీసుకున్నారు. మా లాజిక్ ను కూడా పరిగణనలోకి తీసుకుని ఇలా విడుదల చేస్తున్నారు.
* ఇలాంటి పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ తగ్గించాల్సిన అవసరముందా అనంటే ఉందనే నా సమాధానం ఉంటుంది. నూటికి నూరు శాతం హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలి. ఇంత బిజినెస్ కాదు ఇంత అవుతుంది అనుకున్నపుడు తప్పదు కదా. కాస్ట్ కటింగ్ తప్పనిసరిగా కావాలి. సినిమా వల్ల ఏ ఒక్కరూ నష్టపోకూడదు. పరిస్థితుల్ని బట్టి ప్రతి ఒక్కరి మీదా ఆ బాధ్యత ఉంటుంది. నిర్మాత మాత్రం నష్టపోకూడదు.
* నాకు మొదటి రోజు సినిమాని ప్రసాద్స్ లో చూసే అలవాటు. ఈసారి దాన్ని కోల్పోయా. కాకపోతే ఓ ప్రివ్యూ థియేటర్ లో నా ఫ్యామిలీకి ఈ సినిమాని చూపించే ఏర్పాటుచేస్తున్నా. ఇతర భాషల సినిమాలు చేయాలని లేదు. నాకు తెలుగు సినిమాలంటే పిచ్చి. పాత్ర డిమాండు చేస్తే ఏ తరహా పాత్ర అయినా చేస్తా.
* అక్టోబరు ఫస్ట్ నుంచే నా సినిమా షూటింగులు ప్రారంభమవుతాయి. టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ తర్వాత మరో రెండు సినిమాలు అంగీకరించా. అందులో ఓ కొత్త దర్శకుడు కూడా ఉన్నారు.
* కరోనా వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారికి పని కల్పించడం ఒక్కటే దారి. పరిస్థితి తలచుకుంటేనే బాధగా ఉంది. అందరికీ పని కల్పించాల్సిన బాధ్యత ఉంది. నటులంతా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు కదలాలి. ఇలా ఎంతకాలం ఉంటాం. కరోనా మీద ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయా. తినడం, పడుకోవడమే.
* నా ‘వి’ సినిమా బి, సి సెంటర్లకు కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. మారుమూల పల్లెటూళ్లలోనూ మొబైల్ ఫోన్లలో సినిమాలు చూసేస్తున్నారు.
– హేమసుందర్ పామర్తి