ఏపీ సిఐడి చీఫ్ పి.వి. సునీల్ కుమార్ పై దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. గృహ హిమస్య కేసులో ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ పై తెలంగాణ పోలీసులు ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేశారని, ఇక ఈ కేసు త్వరలోనే ట్రయల్స్ కు కూడా రాబోతోందని ఆయన ఆయన కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక రఘురామ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ , ఫిర్యాదు పై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సి.ఎస్. కు లేఖ రాసింది.
20 ఏళ్లపాటు తనతో కాపురం చేసిన భార్యను దారుణంగా వేధించిన అధికారికి మహిళలపై వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన ‘దిశ’ చట్టం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమంటే మహిళల భద్రతను కాలరాయడమేనని రాఘురామ తన లేఖలో ఆరోపించారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా, సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులను వేధిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన మామ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసిన అంశాన్ని రఘు రామ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో గుర్తు చేశారు.
అదేవిధంగా ,ఐపిఎస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్స్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాలు కూడా సేకరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ అంశంపైనా దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఇక రఘురామ రాసిన లేఖ పై స్పందించిన హోంశాఖ ఏపీ సీఎస్‌కు లేఖ రాస్తూ.. రఘురామ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, చర్యల నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది.











