వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. కూటమి సర్కార్‌పై స్వరం పెంచుతున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన అవాకులు చెవాకులు పేల్చుతున్నారు.. జగన్ తలచుకుంటే చంద్రబాబు నాయుడు గతంలోనే మరోసారి జైలుకి వెళ్లేవాడని, తాము కక్షపూరిత రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు సజ్జల.. నెల్లూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి వచ్చిన సజ్జల.. తమ నేతలని చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని ఆరోపించారు. ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, రాష్ట్రంలో పలు వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని అధిక్షేపించారు సజ్జల..
ఇటు, చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో వాస్తవాలున్నాయని అభిప్రాయ పడ్డారు ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు.. అక్కడితో ఆగకుండా, తమ నేతలని కూటమి సర్కార్ వేధిస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఈ అరెస్ట్‌ల పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు సజ్జల..
సజ్జల కామెంట్స్‌పై రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.. అక్రమ కేసులతో, బూతులతో గత అయిదేళ్లు వైసీపీ సర్కార్, జగన్ మంత్రులు టీడీపీ, జనసేన నేతలని ఏ స్థాయిలో వేధించారో చూశారు.. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేతల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేసి, బుల్డోజర్లతో వెంటాడారు.. వారిపై అక్రమ కేసులు బనాయించారు.. వారిపై కేసులలో చిన్న ఆధారాన్ని నిరూపించలేకపోయారు.. ఇక, ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సన్నివేశాలను ఎలా మరిచిపోగలరు…?? ఇవి అన్నీ సజ్జల నాడు అధికార మత్తులో మరిచిపోయి ఉండవచ్చునేమో కానీ, ప్రజలు అంత మూర్ఖులు కారు… వారి మైండ్‌లో ఆ విజువల్స్ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి..
ఇంత వినాశనం, అరాచకంతోనే జగన్‌కి 11 స్థానాలు కట్టబెట్టారు ప్రజలు. జగన్ పక్కనే ఉండి, ఆయనకు చచ్చు సలహాలు, సూచనలు ఇచ్చి సకల శాఖా మంత్రిగా సజ్జల వెలగబెట్టిన బాగోతం అంతా ఇంతా కాదు.. జగన్ మాజీ నమ్మినబంటు, రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కదిలిస్తే సజ్జల సీక్రెట్‌లు అన్నీ బయటకు వస్తాయి.. ఇటు, ఆయనే స్వయంగా 60 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించిన కేసులో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితులలో ఉన్నాడు.. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ సజ్జల విచారణకు హాజరవుతున్నాడు.. ఇవన్నీ ఆయన చేసిన స్వయంకృతాపరాధాలు.. తప్పులు, పాపాలు..
తన వార్నింగ్‌లతో సజ్జల… వైసీపీ మీడియాలో హల్ చల్ చేయవచ్చునేమో కానీ, కేసుల నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డినే కాదు, జగన్, సజ్జలని కూడా ఎవరూ కాపాడలేరు… తప్పు చేసిన వారిపై రెడ్ బుక్ కత్తి ఎప్పటికీ వేలాడుతూనే ఉంటుందని ఇటీవలే మహానాడు సాక్షిగా మరోసారి గుర్తు చేశారు టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్. వార్నింగ్‌లు ఇవ్వడం కాదు, తానూ పునీతుడిని అని చెప్పడం కాదు, కోర్టులో నిరూపించుకోవడానికి రెడీగా ఉండు సజ్జల అని కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు.. ఇదంతా ఆయన అరెస్ట్ భయంతోనే ఈ కామెంట్స్ చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు సానుభూతి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.. ఏది నిజమో సజ్జలకే తెలియాలి..