ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ నేతలు…ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించబోతున్న తరుణంలో, వైసీపీ వ్యూహకర్త, జగన్‌కు అత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలు తన బాస్ జగన్ మోహన్ రెడ్డికే వెన్నుపోటు పొడిచినట్లు ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది..
అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తుంటే..సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చి వింత వాదనను వినిపించారు. మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం అని చెప్పాం? అసలు ఇప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ ఎదురుదాడికి దిగారు. కానీ, ఈ మాటలే ఇప్పుడు వైసీపీలో చర్చకు దారి తీశాయి..
ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే.. ఇప్పుడు సజ్జల మేము వ్యతిరేకం కాదు అనడం అంటే, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టినట్లే కదా.? ఇది జగన్ పరువు తీయడమే కాదు, ఆయనకు వెన్నుపోటు పొడవడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను అమరావతి ప్రజలు మర్చిపోలేదు. అమరావతిని శ్మశానం అని, ‘భ్రమరావతి’ అంటూ వెటకారం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై లాఠీఛార్జీలు చేయించి, పాదయాత్రలను అడ్డుకున్నారు. అమరావతిని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాడారు.
సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుందా అనే విధంగా ఉన్నాయి. నిజంగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాకపోతే, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఎందుకు ఉంచారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జగన్ చేసినదంతా తప్పేనని సజ్జల పరోక్షంగా ఒప్పుకున్నట్లయ్యింది..











