వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఆర్డీటీ వ్యవహారం ఒక్కటి సరిపోతుంది. అనంతపురం జిల్లాల్లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడంతో పాటు.. లక్షల మందికి ఇళ్లు కట్టించిన స్వచ్ఛంద సంస్థకు సీమ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. 2020లో ఆర్డీటీకి FCRA లైసెన్స్ రెన్యువల్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ చర్యతో ఆ సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. అప్పటికే ఖాతాల్లో ఉన్న 2 వేల కోట్ల నిధుల వినియోగంపైనా ఆంక్షలు విధించారు. స్థానకంగా దాతల నుంచి సేకరించిన డబ్బు.. ఇతర నిధులతో అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు కొనసాగిస్తూ వచ్చారు.
ఆర్డీటీ డైరెక్టర్ మోంచో ఫెర్రర్.. అప్పటి సీఎం జగన్‌ను కలిసి FCRA రెన్యువల్‌కు ఉన్న అడ్డంకులను తొలగించమని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కరిస్తానని హామీ అయితే ఇచ్చారు గానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆర్డీటీ ప్రతినిధులు తర్వాత కాలంలో అప్పటి సీఎం జగన్‌ని.. కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు.. ఆర్డీటీ డైరెక్టర్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేదు. అందుకే FCRA రెన్యువల్ ఆగిపోయిన తర్వాత నాలుగేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నా.. ఆర్డీటీకి ఉపశమనం లభించలేదు.
యువగళం పాదయాత్ర సమయంలో నారా అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు.. అక్కడి టీడీపీ నాయకులు ఆర్డీటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించిన నారా లోకేశ్.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఆర్డీటీకి FCRA లైసెన్స్ రెన్యువల్‌ని బాధ్యతగా తీసుకున్న లోకేశ్… కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఎంపీ సానా సతీశ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు అప్పగించారు. అదే విధంగా ఆర్డీటీ డైరెక్టర్ మోంచో ఫెర్రర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లోకేశ్‌ని కలిసే ఏర్పాటు చేశారు. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏం జరుగుతుందో ఫెర్రర్‌కు లోకేశ్ వివరిస్తూ వచ్చారు. నిస్వార్ధంగా ప్రజల కోసం సేవ చేస్తున్న ఆర్డీటీ డైరెక్టర్‌కు సముచిత గౌరవం ఇచ్చిన లోకేశ్.. తనను కలిసిన తర్వాత ఆయనతో పాటు బయటకు వచ్చి స్వయంగా కారెక్కించి వీడ్కోలు పలికేవారు. కూటమి ప్రభుత్వం కృషితో ఈ మధ్యే ఆర్డీటీకి FCRA లైసెన్స్ రెన్యువల్ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ఈ పరిణామంతో విదేశీ నిధులకు ఆటంకాలు తొలగిపోవడంతో పాటు.. ఖాతాల్లో స్తంభించిన 2 వేల కోట్లు వాడుకొనే వెసులుబాటు కలుగుతుంది.
వైసీపీ హయాంలో ఆర్డీటీ ప్రతినిధులకు జగన్ దర్శనభాగ్యం కలగకపోయినా.. ఇప్పుడు FCRA లైసెన్స్ క్రెడిట్ తమకే దక్కుతుందని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకొంటున్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆర్డీటీ ప్రతినిధులకు తెలుసు.. అనంతపురం ప్రజలకు తెలుసు. అయినా క్రెడిట్ చోరీ అంటూ ఫ్యాన్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంతో వాళ్ల పరువే పోతోంది. ఆ సంస్థను నిలువునా ముంచేసి.. ఇప్పుడేదో ఉద్దరించినట్లు చెప్పుకొంటున్న వైసీపీ అసలు నైజం ఏంటో ప్రతి ఒక్కరికీ అర్ధమవుతోంది..











