తన అనారోగ్యం మీద తానిప్పుడు ఫైట్ చేస్తున్నానంటూ నటి సమంత వ్యాఖ్యానించింది. ‘యశోద’ సినిమాలో ఆమె భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా ఆమె కనిపించనుంది. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటరేననాలి. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూనే ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితిపై సమంత మాట్లాడారు. తానిప్పుడు రికవరీ అవుతున్నానని, త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తన గురించి పత్రికల్లో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ‘ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం’ అని వివరించారు. యశోద సినిమా విడుదలవుతుంటే ఎగ్జైట్ అవుతున్నానని, కొంచెం నెర్వస్ కూడా ఉందన్నారు.
‘యశోద’ కథ గురించి అడిగితే ‘సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ‘యశోద’ ఒకటి. ‘యశోద’ పాత్ర నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు’ అన్నారు.
పురాణాల్లో ‘యశోద’ గురించి విన్నాం. మోడ్రన్ ‘యశోద’ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ ‘ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన ‘యశోద’ గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత ‘యశోద’ క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది’ అన్నారు. సరోగసి విధానంపై అభిప్రాయం చెబుతూ తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం అన్నారు.











