(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
‘ఏమో గుర్రం ఎగరావొచ్చు’ అని ఒక కవి చమత్కరించినట్టు రాజకీయ పైరవీలకు , అవినీతికి అలవాటు పడ్డ విజయనగరం జిల్లా ఉన్నతాధికారులు ‘తిమ్మిని బమ్మి .. బమ్మిని తిమ్మి’ చేస్తున్నారు. ఒక సాధారణ ఉపాధ్యాయుని ఏకంగా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించి ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా వ్యవహరిస్తున్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ చైల్డు లేబర్ ప్రాజెక్టు (ఎన్ సి ఎల్ పి) డైరెక్టర్ గా కొద్ది నెలల క్రితం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని ఎం. సన్యాసమ్మను డెప్యూటేషన్ పై నియమించారు. ఈమె విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అర్దన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్ సి ఎల్ పి ప్రాజెక్టు డైరెక్టర్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఎ సి ఎల్)ను నియమించాలని , డెప్యూటేషన్ పై ఈ పోస్ట్ భర్తీ చేయరాదని కేంద్రప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ఆధారంగా సన్యాసమ్మ స్థానంలో స్థానిక ఎసిఎల్ వెంకటేశ్వరరావును ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమిస్తూ గత నెల 21న జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
కథ అడ్డం తిరిగింది
జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు విడుదలైన మరుక్షణం నుండి రాజకీయ పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎసిఎల్ వెంకటేశ్వరరావును ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యత లు చేపట్టకుండా అడ్డుకున్నారు. వేరొకవైపు ప్రాజెక్టు డైరక్టర్ గా ఉన్న సన్యాసమ్మను ఇక్కడ రిలీవ్ చేసినప్పటికీ, ఆమె ఉపాధ్యాయినిగా తిరిగి విధుల్లో చేరలేదు. పీడీగానే కొనసాగేందుకు ఆమె అధికార పార్టీకి చెందిన ఒక నాయకునితో ఉన్నతస్థాయిలో పైరవీలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేరొకవైపు పీడీగా బాధ్యతలు చేపట్టేందుకు ఈ నెల15న వెంకటేశ్వరరావు కార్యాలయానికి వెళ్లినప్పటికీ సంబంధిత అధికారులు చేర్చుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అదేతరుణంలో రాజకీయ పైరవీలకు తలొగ్గిన జిల్లా ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావు అనారోగ్యంతో (సిక్) సెలవులో ఉన్నట్లు పేర్కొని సన్యాసమ్మనే తిరిగి పీడీగా నియమిస్తూ 16న ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే..
కోట్లాదిరూపాయల లావాదేవీలు చోటుచేసుకుంటున్న ఈ ప్రాజెక్టు లో గత ఆరునెలల్లో లక్షలాది రూపాయల విలువ చేసే అక్రమాలు , అవినీతి చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల్లో ఉన్నతాధికారుల భాగస్వామ్యం, రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కినట్టు తెలుస్తోంది.










