(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం నీలాచలం కొండపై శ్రీరాముని విగ్రహ ధ్వంసం కేసును దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఇన్విస్టిగేషను టీం చీఫ్ డిఐజి జివిజి అశోక్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం శనివారం రామతీర్ధంను సందర్శించారు. నీలాచలం కొండ పైగల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిట్ చీఫ్ జివిజి అశోక్ కుమార్ సిట్ బృందం, సిఐడి, జిల్లా పోలీసు అధికారులు, క్రైం పోలీసులు, సిబ్బంది ఈ కేసులో ఇంత వరకు చేపట్టిన దర్యాప్తు, సాధించిన పురోగతిని
జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. ఈ కేసు నమోదైన దగ్గర నుండి పోలీసుశాఖ చేపట్టిన చర్యలను, దర్యాప్తునకు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు, చేపట్టిన చర్యలను, విచారణ చేసిన తీరును సిట్ చీఫ్ డిఐజి జివిజి అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని అడిగి
తెలుసుకున్నారు.
ప్రతిష్టాత్మకంగా ..
ఈ సందర్భంగా సిట్ చీఫ్ డిఐజి జివిజి అశోక్ కుమార్ మాట్లాడుతూ – ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లోని ఆలయాల్లో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోవడంతో వీటన్నింటికి ఏదైనా ఒకే విధమైన కారణం ఏదైనా ఉందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి, దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినందున త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, స్థానిక పోలీసుల సహకారంతో కేసు
మిస్టరీని చేధించేందుకు తమవంతు కృషిని చేస్తామన్నారు. ఈ కేసులో ఏదైనా సమాచారం లభిస్తే రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9392903400కు సమాచారం అందించాలని సిట్ చీఫ్ ప్రజలను కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, కేసు మిస్టరీని ఛేధించేందుకు సిట్ బృందం సభ్యులు ఇతర పోలీసుల సమన్వయంతో, శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు. అంతేకాకుండా కేసు దర్యాప్తులో అవసరమైన సహాయ, సహకారాలను స్థానిక పోలీసులు సిట్ బృందానికి అందించాల్సిందిగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని సిట్ చీఫ్ డిఐజి జివిజి అశోక్ కుమార్ కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, సిఐడి అదనపు ఎస్పీ ఎల్.వి.శ్రీనివాసరావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, సిసిఎస్ డిఎస్పీ జె.పాపారావు, సిట్ డిఎస్పీ ఆర్ఎస్ఎన్ మూర్తి, సిసిఎస్ సిఐ విజయానంద్, ఎస్బీ సిఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, పలువురు ఎస్ఐ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.