గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు హత్యలు, దాడులు, కేసులతో పల్నాడు గ్రామాలు రాయలసీమ ఫ్యాక్షన్ ను తలపిస్తున్నాయి. గడచిన 20 నెలల కాలంలో ఐదుగురు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు. 82 దాడులు జరిగాయి. ఇక టీడీపీ వారిపై కేసులకు లెక్కే లేకుండా పోయింది. పల్నాడు ఫ్యాక్షన్ గ్రామాల్లో టీడీపీ నాయకులు తిరిగే పరిస్థితి లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కూడా వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు.
నేతల అండతో బరితెగిస్తున్న వైసీపీ శ్రేణులు
ప్రజాప్రతినిధుల అండతో పల్నాడులో వైసీపీ శ్రేణులు బరితెగిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ శ్రేణులు పల్నాడులోని ఆత్మకూరు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగారు. దీంతో గ్రామస్థులంతా గ్రామం విడిచిపారిపోయారు. దీంతో వీరందరికీ గుంటూరు టీడీపీ కార్యాలయంలో కొన్ని రోజులపాటు బస ఏర్పాటు చేశారు.
చివరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఛలో ఆత్మకూరు కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. దీంతో ఆత్మకూరు టీడీపీ నాయకులు వారి గ్రామం చేరుకున్నారు. అయితే నేటికీ గ్రామంలో టీడీపీలో కీలకంగా తిరిగేవారు మాత్రం గ్రామం వెళ్లడానికి భయపడుతున్నారు. వారు గుంటూరు, నరసరావుపేటలో నివశిస్తున్నారు. అటు వ్యవసాయం చేసుకోలేక, గ్రామంలో ఉండాలంటే భయంతో వారు పండుగలకు కూడా స్వగ్రామాలకు వెళ్లలేకపోతున్నారు.
హత్యలు, దాడులు, టీడీపీ వారిపై కేసులు
టీడీపీ నాయకులను హత్య చేయడం, లేదంటే దాడులకు పాల్పడంతోపాటు తిరిగి వారిపైనే నాన్ బెయిలబుల్ కేసులతో పల్నాడులో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జంగమహేశ్వరపాడు గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ శ్రేణులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎదురుపడ్డ టీడీపీ నాయకుడు కోటయ్యపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. దీంతో కోటయ్య తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది రోజుల చికిత్స అనంతరం కోటయ్య మృతి చెందారు. పోస్టుమార్టం నిర్వహించారు. దెబ్బల వల్ల చనిపోయాడని తేల్చారు.
అయినా పోలీసులు దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. పైగా కోటయ్యను రక్షించేందుకు వెళ్లిన టీడీపీ వారిపై 30 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో పల్నాడులో టీడీపీ నాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా అంకులు హత్య
పల్నాడులోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత అంకులు హత్య సంచలనం సృష్టించింది. గ్రామంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు టీడీపీ నేతలు గ్రామం వదలి సమీపంలోని దాచేపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆ ప్రయత్నంలోనే అంకులు దాచేపల్లిలో ఇళ్లు నిర్మించుకునే పనిలో ఉన్నారు. అంకులును ఎలాగైనా హతమార్చాలని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. చివరకు అంకులు దాచేపల్లి రప్పించి హత్య చేశారని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ విమర్శించారు. పెదగార్లపాడు గ్రామంలో ఉన్న అంకులుకు ఫోన్ చేసి దాచేపల్లి రావాలని పోలీసులు చెప్పారని దీంతో ఆయన వచ్చారని, కాపు కాసిన దుండగులతో హత్య చేయించారని తెలుస్తోంది.
అంకులు హత్య కేసులో పురోగతి…
పల్నాడు ఫ్యాక్షన్ గ్రామం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. అంకులు హత్యకు సుపారీ గ్యాంగును ఉపయోగించనట్టు సమాచారం సేకరించారు. అంకులు హత్యకు రూ.15 లక్షలకు సుపారీ గ్యాంగుతో పనికానిచ్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలో అంకులు హత్యపై పోలీసులు కీలక నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కీలక సూత్రదారులను వదిలేసి, పాత్రదారులను బలిచేయాలని చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.