నాలుగు దశాబ్దాల సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవికి రాజీనామా సమర్పించారు. అనేక పత్రికల్లో ఎడిటర్ గా, హెచ్ ఎం టీవీ ఎండీగా పనిచేసిన రామచంద్రమూర్తి సాక్షి పత్రికలోనూ రెండు సంవత్సరాలుపైగా ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కె. రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీ సలహాదారుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో రామచంద్రమూర్తి ప్రజలకు సేవ చేయవచ్చని భావించారు. అయితే గ్రౌండ్ లెవల్లో జరిగింది వేరుగా ఉంది.
ఆశించిన పదవి ఇచ్చారు, పెద్ద చాంబర్ కేటాయించారు. కానీ పెద్దాయనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదట. పదవీ బాధ్యతలు తీసుకుని ఆరు నెలలు దాటిపోయిన ఆయన ఛాంబర్‌కు ఒక్క ఫైలూ రాలేదట. దీనికి తోడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా కనీసం ఆయనకు మాట మాత్రం కూడా చెప్పకపోవడంతో పెద్దాయన కినుక వహించారట. కేవలం జీతాలు, భత్యాల కోసమే పదవి అన్నట్టుగా తయారు కావడంతో తాజాగా ఆయన పదవికి రాజీనామా చేశారు.
మిగిలిన సలహాదార్లు ఏం చేస్తున్నారు?
ఏపీ ప్రభుత్వంలో 33 మంది సలహాదారులుండగా అందులో 11 మందికి క్యాబినెట్ ర్యాంకు కేటాయించారు. క్యాబినెట్ మంత్రికి లభించే సౌకర్యాలతోపాటు వారికి అందే జీతాలు, భత్యాలు అన్నీ కొందరు సలహాదారులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో చాలా మందికి ఛాంబర్లు కూడా లేవు. కొందరు సలహాదారులు పదవిలోకి వచ్చి సంవత్సరం గడచిపోతున్నా, ఒక్క సలహా ఇచ్చింది లేదు. వీరిని సలహాలు అడిగిన నాధుడూ లేడు. నెలకు జీతం, అలవెన్సులు అన్నీ కలపి ఒక్కొక్కరికి రూ.5 లక్షలదాకా వస్తోంది. కొందరు సలహాదారులకు ముందే తెలుసట.
సాక్షి పత్రిక, టీవీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి ప్రభుత్వ సొమ్ము ధారపోస్తున్నారు. ఆ మేరకు సాక్షి యాజమాన్యానికి ఆర్థిక భారం తగ్గింది. అయితే వీరంతా ప్రభుత్వానికి గుదిబండలా మారారు. ఏటా సలహాదారుల జీతాలు, భత్యాలు, కార్లు, అలవెన్సుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 18 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. అయితే వీరిచ్చే సలహా ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం వేయకమానదు.
ఇది తెలియని సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి సలహాదారుగా పదవిలో చేరారు. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క ఫైలూ రాకపోగా పట్టించుకునేవారే లేకపోవడంతో సీన్ అర్ధమై పోయిందట. వైసీపీలో కేవలం ఆరుగురే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కూడా స్థానికంగా పలువురు అనుకుంటూ ఉంటారు.
సలహాదారులు అనగానే వీరంతా సీఎంకు, ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకుంటే పొరపాటే. ఎక్కడైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఏదో పెద్ద జీతం వస్తుంది. పేరు చివర ఒక డిజిగ్నేషన్ వస్తుంది చాలు అనుకుంటే మాత్రం సలహాదారుగా చలామణి కావచ్చు. లేదంటే ఏదో సీఎంకు సలహాలు ఇచ్చి మరింత దగ్గర కావాలనుకుంటే మాత్రం సాధ్యంకాని పని.
రెడ్డి లాబీయింగ్ తట్టుకోలేకపోయారా?
వైసీపీ ప్రభుత్వాన్ని నడిపించే ఆ ఆరుగురు పెద్దలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అనే ప్రచారం ఉంది. ఎంత సన్నిహితులు అయినా సామాజికవర్గం తేడా ఉంటే మాత్రం వారిని పెద్దగా పట్టించుకోరని తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహాదారు అజేయకల్లం వీరే చక్రం తిప్పేది. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు దిక్కులేకుండా పోయిందని అంతర్గత సంభాషణల్లో స్వయంగా వారే మాట్లాడుతున్నారు. ఇక సలహాదారులను ఎవరు పట్టించుకుంటారు. అందుకే రెడ్డి లాబీయింగ్ తట్టుకోలేకపోవడం, చేతిలో పనిలేకపోవడం వెరసి రామచంద్రమూర్తి రాజీనామాకు దారితీసిందని సమాచారం.











