లియో ప్రతినిధి : భాజపా ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు ఏపీ కొత్త చీఫ్ గా నియమితులైన తర్వాత.. మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీని.. మెగాస్టార్ తో భేటీగానే చూడాలా? లేదా, 2009లో ముఖ్యమంత్రి పదవి ఆశావహుడు, తెలుగు రాష్ట్రానికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించిన అప్పటి సరికొత్త రాజకీయశక్తికి సారథి, ఆ తర్వాత కాంగ్రెసు తరఫున కేంద్ర మంత్రి అయిన నాయకుడు చిరంజీవిని కలిసినట్లుగా భావించాలా అనేది ఇంకా సస్పెన్సే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గణాంకాలపరంగా బలంగా కనిపించే కాపు ఓట్ బ్యాంక్ (27శాతం)ను ఏకం చేయడానికే ఈ భేటీ జరిగిందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతోంది.
కాపు బలం గట్టిదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు ఎన్నికలను ప్రభావితం చేయగల మూడు ప్రధాన శక్తులుగా ఉన్నాయి. ఇందులో రెడ్డి, కమ్మ కులాలు విడివిడిగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పర్యాయపదాలుగా స్పష్టమైన ముద్ర కలిగి ఉన్నాయి. రాజకీయ తరాజులో ఎటు మొగ్గితే ఆ పార్టీకి అధికారాన్ని అందించే తృతీయశక్తిగా కాపు వర్గం ఉంది. కులాలు మద్దతిచ్చినంత మాత్రాన.. రాష్ట్రంలోని యావత్ కులం ఓట్లు గంపగుత్తగా అదే పార్టీకి పడిపోతాయనుకోవడం భ్రమే. అయితే ఆ ప్రభావం గణనీయంగా ఉంటుందని విస్మరించకూడదు.
అందుకు నిదర్శనం గత రెండు ఎన్నికలే. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. పార్టీ మంచి ఊపు మీద కనిపించింది. కాపు వర్గం మొత్తం ఆ పార్టీని ‘తమ సొత్తు’గా భావించింది. పార్టీ పెట్టిన తొలి పర్యాయమే ముఖ్యమంత్రి కాగలనని బలంగా నమ్మిన చిరంజీవి.. కేవలం 18 సీట్లు సాధించిన పార్టీ నాయకుడిగా మారారు. చిరంజీవి చీల్చిన కాపు ఓటు బ్యాంక్ చంద్రబాబునాయుడుకు శాపమైంది. ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2014 నాటికి పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేనను స్థాపించారు. ప్రజారాజ్యం స్థాయిలోకాకపోయినా.. సినిమాటిక్ గా సాగిన ఈ పార్టీకి మంచి బజ్ వచ్చింది. పవన్ మోడీకి జైకొట్టి, భాజపా- తెలుగుదేశం అవసరార్థ కూటమికి అండగా నిలిచారు. ఆయన సమీకరించగలిగిన కాపు ఓటు బ్యాంక్- ఈసారి జగన్‌కు శాపంగా మారింది. చంద్రబాబును అధికారపీఠంపై కూర్చోబెట్టింది.
అలా ఈ రెండు సందర్భాల్లోనూ కాపు బలం- రాష్ట్రం కళ్లకు కట్టింది.
కాషాయదళం ఆశ కాపు వర్గం మీదనే?
సరిగ్గా ఆ పాయింట్‌ను కాషాయదళం పట్టుకుంది. చంద్రబాబుతో జట్టుకట్టి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో స్వతంత్ర శక్తిగా ఎదిగే ప్రయత్నాలను విడిచిపెట్టని బీజేపీ.. రాష్ట్ర సారథ్య బాధ్యతల్ని కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ చేతిలో పెట్టింది. ప్రత్యేకహోదా దగ్గరినుంచి, పోలవరం డ్యాం, రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ను అనేక రకాలుగా వంచించారనే అపకీర్తిని మూటగట్టుకున్న మోడీ సర్కారు మీద తెలుగు ప్రజల్లో ఏర్పడిన ఏహ్యభావం.. 2019 ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగిన ఆ పార్టీకి నోటాకంటె తక్కువగా, ఒక్క శాతం ఓట్లను అందించింది. అయినా సరే.. కాపు ఓటు బ్యాంక్ బలాన్ని వారు విస్మరించలేదు.
తెలుగుదేశం నుంచి దూరం అయిన జనసేనను అక్కున చేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కాపుల కొత్త ఆశాజ్యోతి పవన్ అయినప్పటికీ.. ఆయనకు లభించింది కేవలం 6 శాతం ఓట్లే. కాపు పార్టీచీఫ్, కాపు ఆశాజ్యోతితో మైత్రి.. 2024 ఎన్నికల్లో తమకు మేలు చేస్తాయని కమలదళం ఆశ పెట్టుకుంది. అందుకే కన్నాను మార్చిన తర్వాత, కొత్త అధ్యక్షుడిగా కూడా అదే వర్గానికి చెందిన సోము వీర్రాజును ఎంచుకుంది. ఆయన ఇప్పుడు… రాజకీయంగా మసకబారిపోయిన కాపు వైభవదీప్తి చిరంజీవితో భేటీ అయ్యారు. ఆయనను రాజకీయంగా మళ్లీ తెరమీదకు తేనున్నారా.. అనే చర్చ నడుస్తోంది. కాపుబలాల్ని మొత్తంగా సమీకరించడానికి ఇది కాషాయదళం వ్యూహంగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి?
భాజపాతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి .. ఆ పార్టీకి తాను తప్ప చరిష్మాగల మరో నాయకుడు దిక్కులేరని భావించారు. 2019లో ఓట్లు రాకపోయినప్పటికీ.. జనసేన కంటె భాజపాకే రాష్ట్రంలో ఊరూరా కిందిస్థాయి వరకు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్న మాట నిజం. ఇప్పుడు సోము వీర్రాజు భేటీ తదనంతర పరిణామాల్లో చిరంజీవి కొత్తగా కమల గుబాళింపులతో పరిమళిస్తే గనుక.. పవన్ ఆశిస్తున్న ప్రాధాన్యం తగ్గుతుంది.
జనసేన ప్రారంభంలోనే చిరంజీవి మీద కూడా పెద్దస్థాయిలో పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత చిరు క్యాంప్ …