పిల్లలకు విద్యాసంవత్సరం వృథా కాకూడదని, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, వారికి చదువులు కూడా సక్రమంగా అందాలని ప్రభుత్వం సంకల్పించడం అభినందించాల్సిన విషయమే. కానీ.. ఆ దిశగా చేసే కృషి ఏకంగా పిల్లల ప్రాణాలనే బలితీసుకునే పరిస్థితి వస్తే.. పునరాలోచన చేయాలా వద్దా?
కేవలం పిల్లలు మాత్రమే కాదు, వారు బడికి వెళ్లి వస్తున్న కారణాన వారి తల్లిదండ్రులు, వారితో పాటు ఉద్యోగధర్మంలో భాగంగానే అయినప్పటికీ.. బడుల్లో గడుపుతున్న టీచర్లు కూడా వందల సంఖ్యలో ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకుంటూ ఉంటే.. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలా? వద్దా? ఇలాంటి ఆలోచనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది.
రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కేసులు భయం గొలిపేరీతిలో బయటపడుతున్నాయి. నవంబరు 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు మొదలయ్యాయి. టీచర్లకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వెలువడే కొద్దీ.. భయం పెరుగుతోంది. ఇప్పటికి రెండురోజులుగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు మాత్రమే వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లు, ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాలో అయితే పది స్కూళ్ల పరిధిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు కరోనా బారిన పడ్డట్టు కలెక్టరే విలేకర్లకు తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పుయడవల్లి పాఠశాలలో 8 మంది విద్యార్థులకు, ముగ్గురు తల్లిదండ్రులకు కరోనా సోకినట్లు తేలింది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 8 మంది టీచర్లకు కరోనా సోకింది.
ఈ జాబితాలో పేర్కొన్నవన్నీ చాలా కొద్ది వివరాలు మాత్రమే. అది కూడా రెండురోజులలో బయటకు వచ్చిన ఫలితాలు మాత్రమే. ఇంకా ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదో తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లెక్కలు తీస్తే.. ఎన్ని వేల మంది కొత్తగా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుంటారో తెలియదు. అవాంఛనీయంగా పరిస్థితులు విషమిస్తే గనుక.. వీరిలో ఎందరు అసువులు బాస్తారో కూడా తెలియదు.
అవసరమా..?
పిల్లల, తల్లిదండ్రుల, టీచర్ల ప్రాణాలను పణంగా పెడుతూ పాఠశాలలు నడపడం అనేది అంత అత్యవసరమా? అనే మీమాంస ఇప్పుడు రేకెత్తుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సాహసించలేదు. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా బడులు తెరవలేదు. ఒరిస్సాలో అయితే ఇప్పట్లో తెరిచే ఆలోచనే లేదని సీఎం ప్రకటించేశారు. ఇందరి మధ్యలో బడులు తెరిచే ఆలోచన, సాహసం చేసినది ఏపీ ప్రభుత్వం మాత్రమే.
కరోనా విషయంలో, నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ ప్రయత్నిస్తే.. కరోనా నేపథ్యంలో భద్రత కల్పించడం మాకు సాధ్యం కాదు అని చీఫ్ సెక్రటరీ చెబుతారు. అదే సమయంలో.. నియంత్రణ కష్టసాధ్యమైన స్కూళ్ల విషయంలో నిర్భయంగా షెడ్యూలు ప్రకటించి 9, 10 తరగతులకు 2వ తేదీన బడులు తెరిచేశారు. మిగిలిన తరగతులకు కూడా ఈనెలలో మొత్తం అన్ని తరగతులకు కూడా తెరిచే ఉద్దేశంతో ఉన్నారు. ఇంత అవసరం ఉందా? అనేది ఆలోచన!
ప్రభుత్వ సంకల్పాన్ని శంకించలేం!
విద్యాసంవత్సరం వృథా అవుతుందనే, పిల్లలు నష్టపోతారనే ఆలోచన ప్రభుత్వానికి ఉండచ్చు. విద్యాసంవత్సరం కాపాడే విషయంలో వారి చిత్తశుద్ధిని శంకించలేం. అందుకు అభినందించాలి కూడా. కానీ అందుకు బడులు తెరవడం మినహా వేరే మార్గం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? అనేది ప్రశ్న. ఇప్పుడు ప్రారంభించినా సరే.. నాలుగునెలలు బడి నడిపి.. పరీక్షలు పెట్టేస్తారు. పది నెలల చదువును నాలుగునెలల్లోనే ముగించడం కూడా ఒక ప్రహసనమే. ఏదో పరీక్షలు జరిపి.. పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేసి.. మమ అనిపించడం తప్ప ప్రభుత్వాలు సాధించేదేమీ లేదు.
మరి పిల్లల గురించి ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు లేదా? అనేది అనుమానం. తెలంగాణలో చాలా కాలం ముందునుంచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్ లైన్ తరగతులు ప్రారంభించారు. దూరదర్శన్ ద్వారా పాఠాలు నిర్దిష్ట సమయాల్లో ప్రసారం అవుతున్నాయి. అందరు కేబుల్ ఆపరేటర్లు తప్పనిసరిగా దూరదర్శన్ ప్రసారాలు అందించేలా చూస్తున్నారు. ప్రతిరోజూ టీచర్లతో.. వాట్సప్ గ్రూపుల ద్వారా.. పిల్లలకు ఆరోజు టీవీలో రాబోయే పాఠాల వివరాలు అందేలా ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి కృషి కూడా బడిలో చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. బడి జరుగుతోంది.. తరగతులు జరుగుతున్నాయి అనిపించుకోవడానికి అది ఒక మొక్కుబడి ప్రయత్నం మాత్రమే. ఫైనల్ గా జరిగేదేంటంటే.. వచ్చే మార్చి నాటికి వాక్సిన్ వస్తే ఒక తీరుగా, రాకపోతే మరొక తీరుగా పరీక్షలు కూడా పూర్తయినట్లుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా పిల్లలను ప్రమోట్ చేసేస్తారు.
ఇలాంటి నిరపాయకరమైన మార్గాన్ని ఏపీ ప్రభుత్వం కూడా ఎంచుకుని ఉండాల్సింది. తాము యూనిఫారంలు పంచేశాం గనుక.. బడులే తెరవకపోతే.. అది వృథా ఖర్చుకిందికి ముద్ర పడుతుందని భయపడ్డారో ఏమో గానీ.. బలవంతంగా బడులు తెరిచారు.
వెనక్కు తగ్గితే తప్పు కాదు
జగన్మోహనరెడ్డిక తాను మడమ తిప్పని నాయకుడిగా పేరు తెచ్చుకోవాలనేది కోరిక. అందుకే ఎన్నికలు నాడు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేశారు. ప్రభుత్వానిక ఆర్థికభారం గుదిబండగా మారుతున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. దానిపై వెనక్కు వెళ్లడం ఆయనకు ఇష్టం ఉండదు, ఒప్పుకోరు అని ఎరిగిన వారు చెబుతుంటారు. ఇది మంచిదే కావచ్చు. కానీ ఇలాంటి పట్టుదలకు పిల్లల, టీచర్ల, తల్లిదండ్రుల ప్రాణాలు బలిఅవుతున్న సమయంలోనైనా కాస్త పట్టు విడుపు ఉండాలి కదా.
స్కూళ్లు తెరవాలనే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ చదువువల వంటి ప్రత్యామ్నాయ, అపాయంలేని మార్గాలు చూడాలి. విద్యార్థులకు నష్టం కలగకుండా.. బోలెడు మార్గాలున్నాయి. వాటి గురించి ఆలోచించాలి.
కోర్టు దాకా వెళ్తే తప్ప తగ్గరా?
ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దృఢచిత్తంతోనే అమలు చేశారు. ఎందరు విమర్శలు చేసినా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. కొన్నిసందర్భాల్లో వ్యవహారాలు కోర్టు దాకా వెళ్లి.. తీర్పులు ప్రతికూలంగా రావడంతో ఆయన వెనక్కు తగ్గవలసి వచ్చింది. ఇప్పుడు కూడా, బడులు బలికోరుతున్న ప్రస్తుత పరిణామాలపై నేడో రేపో ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయిస్తే అటునుంచి స్టే ఉత్తర్వులు, ఆ తర్వాత తీర్పులు వస్తే.. అప్పుడైనా ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పదు. అలా కోర్టులు చెప్పిన తర్వాత తగ్గడం కంటె.. ముందే.. జగన్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుని బడులు తెరవడానికి బదులుగా.. ఆన్ లైన్ లో పాఠాలు చెప్పే మార్గాన్ని ఆశ్రయిస్తే.. పిల్లల చదువుల గురించి మాత్రమే కాకుండా, ప్రాణాల గురించి కూడా పట్టించుకునే ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటారు.
వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోని ప్రతి బిడ్డ మేనమామగా గుర్తించడానికి ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు చాలు. వారి ప్రాణాలతో ఆటలు అవసరం లేదు.
.. సురేష్ పిళ్లె











