“మా సినిమాకు ఓ ఫారిన్ షెడ్యూల్ పెండింగ్ ఉంది. త్వరలోనే మా సినిమా కోసం విదేశాలకు వెళ్లబోతున్నాం. విదేశాల్లోని అందమైన లొకేషన్లలో మా సినిమా పాట తీయబోతున్నాం.” ఈ స్టేట్ మెంట్స్ లో విదేశం అంటే దానర్థం అమెరికా లేదా ఐరోపా మాత్రమే. ఫారిన్ షూటింగ్ అనగానే టాలీవుడ్ జనాలు పొలోమంటూ అమెరికాలోని ఏదో ఒక రాష్ట్రంలో వాలిపోతారు. లేదంటే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, పారిస్ అంటారు. ఈమధ్య మిడిల్-ఈస్ట్ దేశాలకు కూడా వెళ్తున్నారు. కానీ ఫారిన్ షెడ్యూల్ కోసం దుబాయ్ కు ఎవరైనా వెళ్తారా.. ఒకప్పుడు ఈ ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హాట్ ఫేవరెట్ దుబాయ్ మాత్రమే.
మొన్నటికిమొన్న లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే దుబాయ్ వెళ్లాడు నితిన్. రంగ్ దే సినిమా షూటింగ్ ను అక్కడే పూర్తిచేశాడు. అదే టైమ్ లో దుబాయ్ లోనే మాస్ట్రోకు సంబంధించి ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు. రీసెంట్ గా సెకండ్ వేవ్ కు ముందు మహేష్ కూడా దుబాయ్ కే వెళ్లాడు. సర్కారువారి పాట సినిమా కోసం దుబాయ్ లో భారీ షెడ్యూల్ చేశారు. ఇప్పుడు రవితేజ కూడా తన క్రాక్ సినిమా షూటింగ్ కోసం వచ్చేనెల దుబాయ్ వెళ్లబోతున్నాడు.
Also Read:-‘వి’ సినిమా నుంచి ఆ సీన్ తొలగించాల్సిందే!
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ లో దుబాయ్ షెడ్యూల్ కూడా ఉంది. నాగార్జున చేయాల్సిన ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం టాలీవుడ్ అంతా దుబాయ్ చుట్టూ తిరుగుతోంది. షూటింగ్ అంటే చాలు, దుబాయ్ లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అమెరికా, లండన్ మరిచిపోయినట్టే ఉన్నారు.
Must Read:-2050లోకి ప్రభాస్ నాగ్ అశ్విన్ ల ప్రయాణం
ఇండస్ట్రీలో ఈ మార్పుకు కారణం ఏంటి?
టాలీవుడ్ సడెన్ గా ఎందుకిలా మారిపోయింది? అమెరికా అంటే పడిచచ్చే టాలీవుడ్ జనాలు హఠాత్తుగా ఎందుకు ముఖం చాటేశారు. మంచు కొండలు లేకపోతే షూటింగ్ చేయని హీరోలు ఎందుకు స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వెళ్లడం లేదు. దీనంతటికీ ఒక కారణం కరోనా అయితే, మరో ప్రధాన కారణం బడ్జెట్.
ఒకప్పుడు యూరోప్, అమెరికా దేశాల్లో షూటింగ్స్ కు టూరిజంలో భాగంగా రాయితీలు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు కానీ వాటితో పాటు దుబాయ్ లో రాయితీలు, అనుమతులు త్వరగా వస్తున్నాయి. అందుకే టాలీవుడ్ ఇప్పుడు ఛలో దుబాయ్ అంటోంది. అంతేకాదు, అమెరికాతో పోలిస్తే, దుబాయ్ లో మేన్ పవర్ (మానవ వనరులు) కూడా తక్కువ రేటుకే దొరుతున్నాయి.
Also Read:-మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య దర్శకత్వం?
ఇదొక కారణమైతే.. కరోనా తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు అంత సేఫ్ కాదనే అభిప్రాయానికొచ్చారు చాలామంది. అదే సమయంలో కరోనా నివారణ చర్యల్లో దుబాయ్ అందరికంటే ముందుండడం టాలీవుడ్ కు మరో ఆలోచన రానీయకుండా చేసింది. ఈ కారణాల వల్ల ప్రస్తుతం నిర్మాతలంతా దుబాయ్ కే మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికా, యూరోప్ దేశాల్ని పూర్తిగా వదిలేయడం లేదు టాలీవుడ్. అవసరం అనుకుంటే అటువైపు వెళ్తున్నాయి. ఓ మోస్తరు బడ్జెట్ లో చకచకా పని పూర్తిచేయాలనుకుంటే దుబాయ్ కే జై కొడుతున్నాయి. ఇప్పుడీ పరిస్థితులు ఎంతలా మారాయంటే.. ఒకప్పుడు అమెరికా, యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కథలు రాసిన దర్శకులు-రచయితలు.. ఇప్పుడు తమ కథల్లో దుబాయ్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేస్తున్నారు.
Also Read:-సినిమా పడవ మునిగిపోతోందా?