ఒక అమ్మాయిని చూడగానే కొందరికి కాంప్రమైజ్ కావడమా లేక కమిట్ మెంట్ అయినా అడుగుదామా అనిపిస్తుంది. కమిట్ మెంట్ అనేది సినిమారంగంలోనే కాదు సాఫ్ట్ వేర్, మెడికల్ వంటి అన్ని రంగాలలోను. ఉంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలనే మేము రూపొందించిన కమిట్ మెంట్ చిత్రంలో చూపించాం అని దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న స్పష్టం చేశారు. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సిమర్, అభయరెడ్డి, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ ప్రధాన పాత్రలలో ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్, ఎఫ్ 3 ప్రొడక్షన్ పతాకాలపై బల్దేవ్ సింగ్, నీలిమ.టి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది.
హీరోయిన్లు తేజస్విని మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి చేతులమీదుగా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న మాట్లాడుతూ, కమిట్ మెంట్ అడగడం అనేది సినిమారంగంలో మాత్రమే ఉందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ప్రతీరంగంలోనూ ఉందని ఈ చిత్రంలోని నాలుగు కథలలో చూపించబోతున్నాం. స్కిన్ షో తీసి డబ్బు సంపాదించాలని ఈ చిత్రాన్ని తీయలేదు. వాస్తవిక పరిస్థితులను ప్రతిబిబించాలనే దీనికి రూపకల్పన చేశాం. ఎవరైనా అతిథి ద్వారా టీజర్ ను విడుదల చేయిద్దామని అనుకుంటే…టీజర్ బావుందని అంటున్నారు కానీ కమిట్ మెంట్ అని టైటిల్ చూసి సంకోచిస్తున్నారు. అందుకే అతిధులు లేకుండా ఈ టీజర్ ను విడుదల చేశాం. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా కొత్త సినిమాల విడుదల లేకుండాపోయింది. ఈ సినిమా ఆ కొరతను తీరుస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవిధంగా ఉంటుంది అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడూతూ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం, ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేయడం ఆలస్యమైతే ఓటీటీలో విడుదల చేస్తాం. ఏదైనా త్వరలోనే నిర్ణయిస్తాం అని చెప్పారు.
హీరోయిన్లలో ఒకరైన తేజస్విని మదివాడ మాట్లాడుతూ, ఇందులోని పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చిన్న వయసు పాత్ర చేసిన తర్వాత సినిమా రంగంలో కొన్ని సందర్భాలలో కమిట్ మెంట్ అనే పదాన్ని నేను ఫేస్ చేశాను. తెలుగు అమ్మాయిలను డైరెక్టుగా కమిట్ మెంట్ అడిగేస్తున్నారు. అదే బాలీవుడ్ వాళ్ళను ఇతర ప్రతినిధుల ద్వారా అడిగిస్తున్నారు. లవ్, డ్రీం, హోప్, ఫైట్ అనే కథల సమాహారమే ఈ చిత్రం. ఇందులో నేను ఫైట్ చేస్తాను. అదేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్, అభయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- టీజర్ తోనే కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన ‘మాస్టర్’











