తమిళనాడు, పుదుశ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళలో వచ్చే ఏప్రిల్ , మే నెలలో ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం అస్సాంలో బీజేపీ, అస్సాం గణ్ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి, తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి అధికారంలో ఉండగా పుదుశ్చేరిలో సెక్యూలర్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కాంగ్రెస్, డీఎంకే) కూటమి అధికారంలో ఉంది. ఇక కేరళలో వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉండగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ తమిళనాడును కోల్పోవాల్సి ఉంటుందని, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అస్సాం, పుదుశ్చేరిలో మాత్రమే బీజేపీ కూటమికి అవకాశం ఉందని ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే తేల్చింది.
కాంగ్రెస్, డీఎంకే కూటమికే..
ఇక తమిళనాడులో ప్రస్తుతం ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నాయి. జయలలిత మరణం తరవాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు వచ్చాయి.. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీల అధికార ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 43.7శాతం ఓట్లతో 234 స్థానాలకు గాను 135సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కాంగ్రెస్, డీఎంకే కూటమికి 41.1శాతం ఓట్లతో 162 స్థానాలు గెలుచుకుంటుందని, ఎన్‌డీఏ కూటమి 28.7శాతానికి పడిపోతుందని, 98సీట్లకు పరిమితం కావాల్సి వస్తుందని సర్వే తేల్చింది. ఇక శశికళ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం గెలిచే స్థానాలు పెద్దగా ఉండవని, కమలహాసన్ పార్టీ పరిస్థితి కూడా అంతేనని సదరు సర్వే వెల్లడించింది.
రికార్డు బ్రేక్ చేసినా..
1977, 1980, 1984 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచిన పార్టీగా AIADMK రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి 2016 వరకు ఒకసారి ఓ పార్టీకి మరోసారి మరో పార్టీకి ఓటర్లు అవకాశం ఇచ్చేవారు. అంటే వరుసగా రెండోసారి ఏ పార్టీకి అధికారం ఇవ్వలేదు. దాదాపు 30ఏళ్ల పాటు ఇదే సంప్రదాయాన్ని తమిళ ఓటర్లు పాటించారు. 2016 ఎన్నికల్లో వరుసగా రెండోసారి AIADMK కి అధికారాన్నిచ్చారు. 2011లో 38.4శాతం ఓట్లతో 150 స్థానాలు గెలవగా 2016 ఎన్నికల్లో 40.77శాతంతో 135 స్థానాలు గెలుచుకుంది. దీంతో 30 ఏళ్ల సంప్రదాయానికి తెరపడింది.
చిన్నమ్మ పెద్ద దెబ్బ..
రానున్న ఎన్నికల్లో జయలలిత లేకపోవడం, కూటమి పని తీరుతో పాటు శశికళ పార్టీ మక్కల్ మున్నేట్ర కజగం ఎన్డీయే కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. జయలలిత మరణం తరవాత శశికళపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తమిళులు అమ్మగా పిలిచే జయలలిత ఉన్న సమయంలో చిన్నమ్మగా పేరొందిన శశికళకు 80కి పైగా నియోజకవర్గాల్లో 5వేల నుంచి 10వేల మంది సొంత వర్గం, అభిమానులు ఉన్నారు. వారికి తోడు AIADMK అసమమ్మతి వాదులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే యత్నం చేస్తున్నారు మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ నేతలు. ఇదే జరిగితే.. ఎన్డీయే కూటమి భారీగా నష్టపోనుందని తెలుస్తోంది.
దక్షిణాదిలో 2021లో వైఫల్యంతో బోణి..
అదే జరిగితే..బీజేపీకి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. పార్టీ విస్తరణలో భాగంగా తెలంగాణ మీదుగా తమిళనాడు తమ గేట్ వేగా ఆ పార్టీ చెబుతోంది. దేశంలో పార్టీ విస్తరణకు తమిళనాడు, తెలంగాణల్లో పాగా వేయడం ద్వారా సాధ్యమనే అభిప్రాయం ఆ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సర్వే నిజమైతే.. పార్టీ జెండాని దేశమంతా విస్తరించే సంగతి పక్కన పెడితే.. 2021లో బీజేపీ అధికారం నుంచి చేజారనున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలవనుంది. ఇది ఇప్పటి పరిస్థితి. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.