రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు…ప్రతిసవాళ్లు మామూలే. కానీ వాటిని నిలబెట్టుకోవడంలోనే నాయకత్వ లక్షణం అనిపించుకుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘట్టమే నగరంలో ఈ రోజు ఆవిషృతమైంది. అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మంత్రి తలసాని ప్రసంగిస్తున్న సమయంలో సీఎల్పీ నేత భట్టి కలగజేసుకొని విమర్శించారు. అసలు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారా? దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించాలని భట్టి సవాల్ విసిరారు.
ఆ సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నేను స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను అని సభా వేదికగా స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే గురువారం ఉదయం హైదరాబాద్‌లోని కెబిఆర్ పార్కు సమీపంలోని భట్టి విక్రమార్క నివాసానికి అధికారులతో కలిసి వెళ్లారు.
భట్టి ఇంటికి వెళ్లడమే కాకుండా జియాగూడ, గోడే కి ఖబర్, కట్టెల మండి, అంబేద్కర్ నగర్, బండ మైసమ్మ నగర్, GYR కాంపౌండ్, మారేడ్ పల్లిలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తలసాని చూపించారు. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తమ ఇంజనీరింగ్ టీంతో పరిశీలించిన తరువాతనే మాట్లాడుతానని భట్టి విక్రమార్క చెప్పినట్లు తెలిసింది.

తలసాని సక్సెస్ అయ్యారా?
సవాల్ ను విసరడం, విసిరిన సవాల్ స్వీకరించడం రెండూ సాహసమే. ఇక్కడ విపక్ష నేత సవాల్ విసిరారు. ఆయన విసిరిన సవాల్‌ను స్వీకరించి తలసాని నిరూపించుకున్నారు. మరి ఇక్కడ సక్సెస్ అయ్యిందెవ్వరూ? అంటే అసలు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నయా? పూర్తయ్యాయా? వాటి నాణ్యత ఎంతనేది? అది వేరే అంశం. విసిరిన సవాల్ ను స్వీకరించి స్వయంగా తానే విపక్ష నేత ఇంటికి వెళ్లి నగరమంతా పర్యటించి ఇళ్ల నిర్మాణాల పనితీరును చూపించడమనేది నిజంగా హర్షించదగ్గ విషయమని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ విషయంలో తలసాని సక్సెస్ అయినట్లేనని కార్యకర్తలు భావిస్తున్నారట. అయితే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను స్వయంగా పరిశీలించటానికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు ఏమి చెప్తారనే అంశంపై జనం ఆసక్తిగా గమనించారు. కానీ భట్టి విక్రమార్క మాత్రం మౌనంగా ఉండిపోయారు. నాణ్యత విషయంపై త్వరలో మాట్లాడుతానని ఆయన అన్నట్లు సమాచారం.











