తెరమరుగై పోయిన భారీ నిర్మాత కేటీ కుంజుమోన్ మళ్లీ చిత్ర నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారా? ఆయన అధికారిక ప్రకటన చూస్తే ఔననే అనుకోవాల్సి ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఓ పాన్ ఇండియా సినిమాకి ఆయన రంగం సిద్ధం చేసేశారు. అదేమిటో కాదు ‘చికుబుకు చికుబుకు రైలే’ అంటూ అదరగొట్టేసిన ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్ నిర్మించబోతున్నారు. జెంటిల్ మేనే 2 పేరుతోనే ఈ సినిమాని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
హీరో అర్జున్ సర్జా కెరీర్ లోనే ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు శంకర్ కు కూడా ఇది మొదటి సినిమా. మళ్లీ ఇందులో అర్జున్ ఓ కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అప్పటికే శరత్‌కుమార్ హీరోగా వసంతకాల పరవై, సూరీయన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన కేటి కుంజుమోన్ 1993 లో శంకర్ ని దర్శకుడిగా పరిచయం జెంటిల్‌మేన్ చిత్రాన్ని నిర్మించారు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు ఇందులో పెద్ద హైలైట్ గా నిలిచాయి.
ప్రభుదేవా ను హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన కాదలన్ / ప్రేమికుడు సంచలన విజయం సాధించింది. అక్కినేని నాగార్జున, మిస్ యూనివర్శ్ సుస్మితాసేన్ జంటగా తమిళ, తెలుగు భాషల్లో ‘రక్షకుడు’నిర్మించారు. సుస్మిత సేన్ ను వెండితెర కు పరిచయం చేసింది కూడా ఆయనే. మలయాళం స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ లతో కూడా సినిమాలు నిర్మించారు. మొదటి భాగానికి రెండింతలు బలమైన కథాంశంతో జెంటిల్ మేన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. జెంటిల్‌మేన్ ఫిలిం ఇంటర్‌నేషనల్ పతాకంపై ఈ సినిమా ఉంటుందట. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తారట.











